పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, జులై 2012, సోమవారం

వంశీదర్ రెడ్డి || ‎‎* జీతగాడు *.||

"రేయ్, ఆనందం, యాడున్నవ్ రా,
గోదలకొట్టంల కుడిదిగోళం మీద
గిలాస తెచ్చుకో,
శాయ బొట్టు తాగి, బిరాన
చేన్ల కొర్రుకాడికి వోవాలె,
పటేల్కు జెప్పు, పొద్మీకి
పొలంల తాటికల్లు దింపియ్యమని,
మన్మడొస్తుండు పట్నంకెల్లి"

"చిన్న పటేలత్తాండా దొర్సానీ,
ముంజెలు, ఈతపండ్లు గుడ్క తెత్తునా",
తాగిన శా గిలాస కడిగి
అంగీకి తుడుసుకుంట ఆనందం,

* * * * * * * * * * * * * * * * * * * * *

"ఆనందం మంచిగున్నవ,
కొడుకెట్లుండు, ఇంటర్ కదా,
పుస్తకాలేమన్న అవసరముంటె జెప్పు, పంపుత,
ఇంట్లెవర్లేరయా, జెర్సేపు కూసో"
కుడి చేతిల పూరి తున్క,
పొద్దుగాల్ల సంపిన కోడి అంచుకువెట్కొని,
ఎడమ చేత్తోటి తాటికల్లు తాక్కుంట,
బేకోట్లు తీస్కుంట,
చిన్న పటేల్, పట్నంకెల్లొచ్చినట్టుండు..

"బాంచన్ పటేలా,
వానికి సదువెందుకు, కైకిలి పోతాండు,
వాగు మీద లారీలకు ఇశ్క ఎక్కియ్యనీకి",

"బాంచన్,బాంచన్ అనుకుంట
బానిసల్లెక్క బతుకుర్రి,
మా పట్నంల గివేమ్ నడువై, అందరొకటే,
ఎప్పుడు మార్తరయా ఇంకా"
పండ్లల్ల ఇరికిన కోడి బొక్క
గోళ్ళతోని తీస్కుంట చిన్న పటేల్,

"మారుడంటేంది దొరా,
తాత, పోతె, నాయిన, ఆయిన పోతె, మన్మని
కాడ పన్జేసుడేనా,
మా అయ్యను సంపిర్రు సర్పంచెలక్షన్ల పోటీ చేస్తే,
నా కొడుకు నాలిక కోశిర్రు, కాపోల్ల పొల్లతోని మాట్లాడ్తె,
మా ఇండ్లల్ల కూడ ఎవరొ
ఇద్దరు, ముగ్గురు సదూకొని,
సర్కార్ కొలువు చేయవట్టె పట్నంల,
వాడేదో ఆపతిల సోపతైతడనుకుంటే,
ఒక్కసారి ఆడికి పోయినోడు , మల్లీడికేమొస్తడు,
చౌరస్త కాడ, అంబేద్కర్,
మా ఇండ్లను జూస్కుంట,
ఊరిబైటికి వేళ్ళు సూపిస్తడు, ఏంటికో ఎరికేనా పటేలా,
"ఊర్లకు రాకుండ్రా, వొస్తె, సంపుతరు,
ఆడ్నె బతుకుర్రి" అని,

"ఏం రా వారి,
ఏం ముచ్చట్లు వెడ్తున్నవ్ మనుమని తోని,
గిలాస తెచ్చుకో పో, కల్లు పోస్తా" పెద్ద పటేల్,

గిలాస కడిగి,
గోసలెక్క కల్లులొట్టి కాడికి పోకుంట,
ఆనందం....

-29-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి