పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, జులై 2012, గురువారం

భవానీ ఫణి॥ ఎప్పటికైనా॥

అందమైన సీతాకోక చిలుకలనీ
అల్లిబిల్లి మేఘాలనీ
అక్షరాలుగా పేరుస్తూ
ఆనందిస్తున్నాను నేను ,
సరిపోదంటున్నారు...

హృదయాన్ని
మధించాలంటున్నారు
ఎన్నో చేదు నిజాల్ని మరచిపోవాలనుకునే
గరుకు ఘటనల్నీ సుదీర్ఘమైన ఎదురు చూపుల్నీ....
జ్ఞాపకాల అలల్లోంచి
అలవోకగా తియ్యాలంటున్నారు

జీవన ప్రవాహంలో ఆనందాల బిందువుల్ని
ఏరుకోవడం కాదు..
విషాదాన్నీ ఒడిసి పట్టాలంటున్నారు

దేవతల నిండా
దయ మాత్రమే ఉండదంటున్నారు
కొందరిలోని రాక్షసత్వానికి
కారణాలూ అన్వేషించ మంటున్నారు

ప్రపంచాన్ని కొత్త కోణంలోచూడమంటున్నారు
కవితా కన్యని పదాలతో కాదు ...
భావాలతో అలంకరించమంటున్నారు

ఎంత తోడినా తరగని మహా సముద్రాన్ని
అరిచేతిలో ఇముడ్చుకోమంటున్నారు
అర్ధం అయీ కానట్లు అంతరాల్ని
స్పృశించాలంటున్నారు

మనోనేత్రాన్ని తెరవాలంటున్నారు
గరళాన్ని మింగిన గొంతుల్ని కదిపి
గురుతుల్ని చూప మంటున్నారు

అప్పుడే మనసు
అమృత భాండాగారమై జీవిత సత్యాలని
స్రవిస్తుందంటున్నారు

ఎందరెందరో చేస్తున్న ఈ కవితా మధనాన్ని
ఓ మూల నిలబడి చూస్తున్నా
ఎప్పటికైనా నేనూ చెయ్యగలనా అని
అబ్బురపడుతూ !!!!


* 12-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి