పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, అక్టోబర్ 2012, గురువారం

పి.రామకృష్ణ //పులిగారి స్వర్ణకంకణం


పండగొస్తేనే నాకు
వాక్యూంక్లీనర్ గుర్తుకొస్తుంది.


నవరంధ్రాల్లో పూడుకుపోయిన
చెత్తాచెదారం వూడ్చుకోడానికి,
చీపురొకటి
దశమిరోజే అక్కరకొస్తుంది.

నిన్నరాత్రే
పడుకున్న పక్కమీదికీ,
పాత చాయాచిత్రాల వెనుక-
అల్లుకున్న సాలెగూళ్ళ మీదికీ,
ఎయిర్ బ్లోయర్ తన మిస్సైల్
ఎక్కుపెడ్తుంది.

ఇప్పుడు
పులుముకున్న రంగుల్తో-
ముఖం దాచుకోవడం
కొత్తగా వుంటుంది.

జమ్మిచెట్టుపై దాచుకున్న
క్షమాబిక్ష కరవాలం
కసబ్ కసాయితనంపై
కనికరం చూపిస్తుంది.

నైవేధ్యం పెట్టిన పిండివంటకం-
ఉపవాసంతో ఎండబెట్టిన,
ఊబకాయాన్ని ఊస్సురుమనిపిస్తుంది.

పాతబడ్డ పెళ్ళాం-
ఒంటిమీది చీర
కొంగొత్త వర్ణాల్తో పళ్ళికిలిస్తుంది.

ప్రతి తలతోనూ పైశాచికత్వం
ప్రతిధ్వనించే రావణభక్తి-
రణరంగం మధ్య నిలబడి,
గీతాభోద చేస్తుంది.

చేస్తూన్న పాపాన్ని
చూసీ చూడనట్టు వదిలెయ్యమంటూ-
చేతులు జోడించిన పిల్లి
భక్తిగా కళ్ళు మూసుకుంటుంది.

పండగ పదిరోజులూ
పల్లకిపై వూరేగే మహాతాయి
పదకొండోనాటికి
ఒట్టిరాయి గా మిగిలివుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి