పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, అక్టోబర్ 2012, గురువారం

డా|| కాసుల లింగారెడ్డి









1

స్థలాలు వేరు కావొచ్చు
భాషలు మారుతూ వుండొచ్చు
జెండాలు వేరు కావొచ్చు
రంగులు మారుతూ వుండొచ్చు
చరిత్రకు సింగారించిన చీర విప్పితే కదా తెలిసేది
మత ఛాందస నఖక్షతాల పచ్చి పచ్చి గాయాలు-
మౌఢ్యం పారించిన నెత్తుటి నదాలు-
2
నీ తోటలో కోకిల
ఏ రాగంలో పాడాలో వాడే నిర్దేశిస్తాడు
పురి విప్పిన నెమలి
ఏ భంగిమలో ఆడాలో వాడే నిర్ణయిస్తాడు
విశాల సముద్రంలో చేప పిల్ల
ఏ దిక్కు ఈదాలో వాడే రచిస్తాడు
టెన్నిస్‌ కోర్టులో ఎగిరే బంతులపై
ఆంక్షల బంధనాలు విధిస్తాడు
3
ఫత్వాలు జారీ చేయడానికి
ఏ మానవతా విలువలూ అడ్డురాకపోవచ్చు
లజ్జారహితంగా దేశభహిష్కరణ విధించడానికి
మతలబులు మరేమైనా వుండవచ్చు
మతమంటే రాజ్యం చేతిలోని దట్టించిన మరఫిరంగంటే
బ్లాస్ఫెమియర్‌లంటూ బందూకులు ఎక్కు పెట్టవచ్చు
సూర్యుడే కేంద్రకమన్నందుకో
ప్రజలే చరిత్ర నిర్మాతలన్నందుకో
నిన్ను నడివీధిలో ఉరితీయనూవచ్చు
సంస్కృతి చిటారు కొమ్మన కాసిన తీయని ఫలాలు
వేళ్ళు చేసిన త్యాగాల ఫలితమన్నందుకు
దొంగ ఎదురు కాల్పులల్ల ఉసురు తీయనూవచ్చు
హృదయరహిత అనాత్మలోకంలో
మానవత ముసుగు వేసుకున్న మత్తుమందు గుట్టు విప్పుతానంటే
విషమిచ్చి చంపనూ వచ్చు
4
కాలాన్ని మెడకు కట్టుకొని
వెనక్కి నడిపించాలనుకునే వాడు
చరిత్ర ఉరికొయ్యలమీద వేలాడుతాడు
చీకట్లని చీల్చే కొవ్వొత్తులను
జేబులో దాచాలనుకునే వాడు
దగ్ధశరీర శకలాలుగా మిగులుతాడు
తూర్పున ఉదయించే సూర్యుళ్ళని
దోసిట పట్టి పడమరలో పాతేయాలనుకునేవాడు
దిగంతాలావలి అగాథాల్లో అదృశ్యమవుతాడు
5
సథలాలేవైనా,భాషలేవైనా
కత్తుల వంతెనలెన్ని కట్టినా
ఎన్ని అగాథాల సుడిగుండాల సృష్టించినా
కాలం ముందుకు సాగుతూనే వుంటుంది
కొవ్వొత్తులు వొలుగులు చిమ్ముతూనే వుంటాయి
తూర్పు సూర్యుళ్ళని ప్రసవిస్తూనే వుంటుంది
తలకట్ల తకరారుల శిశుపాలుల చేత
అనేకసార్లు ఇంపోజిషన్‌ రాయిస్తూనే వుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి