పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2012, శనివారం

ఆర్.దమయంతి // మల్లె పూవంత సంతకం! //


కవిత్వమంటే - కాదు..
చందోబధ్ధ రూపకం.
వ్యాకరణా సంబంధం
నిఘంటు పదాల సమీకరణం.

కవిత్వమంటే కాదు -
భాషా పరిజ్ఞాన కేం ద్రం.
భావ గాంభీర్యతా నిదర్శనం.
కలం బలనిరూపణం.

కవిత్వమంటే కాదు -
పరిజ్ఞాన పరిపుష్టం
శాస్త్ర విజ్ఞాన ప్రదర్శితం
డాంభిక ఘన ఉపన్యాసం.

నిజమైన కవిత్వం -
జనిస్తుంది.
జ్వలింప చేస్తుంది.

కవిత్వమంటే -
ఆవేదనా బడబాగ్నులు పగిలి ప్రవహించు
పొగల గక్కు నిప్పు సెగల నదులు.
పర్వతాల మీంచి దూకు
ఉధృత జలపాతాలు

కవిత్వమంటే -
రగిలిన యెదల పై చిలుకు
తొలి తొలకరి చినుకులు.
సిరి చందనాల పరిమళాలు.

కవిత్వమంటే -
కను కొలకుల వొలుకు మధురాశ్రువులు
మనసంతా జల్లుకు పోయే పన్నీటి జల్లులు.

కవిత్వమంటే -
ఒక మదిని చూపడం.
ఒక హృది ని కదిలించడం.
ఒక కరుణ చిలికించడం.
ఒక జడాన్ని చైతన్య పరచడం.
ఒక సరి కొత్త జగాన్ని సృష్టించడం.

కవిత్వం -
ఓ సముద్రం. నిశ్శబ్ద ఏకాంతం.
సమ భావనా స్వీకారం
సుజల హృదయ భాష్పం
సకల జనుల సమైక్యా రావం.

ఇక పై కావాలి కవిత్వం
ప్రతి గుండె మీద -
ఓ మల్లె పూవంత సంతకం.
**
date: 07.09.2012.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి