పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, సెప్టెంబర్ 2012, సోమవారం

భవాని ఫణి || ఎదగనిదెవరు??


అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను

నేను కనిపించగానే
తదేకంగా చూస్తారు అందరూ
ఎంతో సంబరపడి పోతాను

కానీ వాళ్ళు నన్ను
సాటి మనిషిగా చూడటం లేదని
నా మస్తిష్కపు అరల్లోంచి వచ్చే సంకేతాలని
నేనసలు పట్టించుకోను

నన్ను చూసి కొందరు నవ్వుతారు కూడా
వాళ్ళ స్పందనకి నేను పులకించి పోతాను
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతాను

కానీ వారి నవ్వు స్నేహపూర్వక మైనది కాదని
నా మెదడులోని
కొన్ని మెతక మేధో కణాలు మొత్తుకుంటున్నా
నేను కొంచమైనా కలవరపడను

ఈ అద్భుతమైన లోకంలో
నాలాగే సృష్టింపబడిన
ఈ మనుషుల్ని చూసి
నాలోని ప్రేమతంత్రులు ప్రేరేపింపబడి
వారి చెంతకి చేరాలనుకుంటాను
అనురాగం పెల్లుబికి
వారిని స్పృశించాలనుకుంటాను

కొందరు వెంటనే దూరంగా జరిగిపోతారు
సభ్యత ముసుగు తొలగించలేని
కొందరి శరీరాల ఉలికిపాటుని
నాలోని సునిశితమైన పరిశోధక నాడులు
పసికట్టి నాకు చేరవేస్తాయి
నేను లక్ష్యపెట్టను

ప్రతి ప్రాణి లోను నిండిఉన్న
జీవశక్తి ని గుర్తించలేని
వారి అజ్ఞానాన్ని చూసి,
పరిగెత్తలేక పడిపోయే పసిపాపని చూసి
ముచ్చట పడే తల్లిలా నవ్వుకుంటాను

ఎప్పుడో అమ్మ కడుపులో ఉన్నప్పుడు
ప్రాణవాయువు అందక
నా మెదడులోని కొన్ని కణాలు
నిర్జీవమైపోయి ఉండవచ్చు

కానీ అన్నీ సవ్యంగా అమరి
సజీవంగా ఎదిగినా,
ప్రేమమయమైన జీవితాన్ని
అనుభవించలేని వారి ఆశక్తతకి జాలిపడతాను

వారిలా మది పొరల్లోంచి
పదాల ఇటుకలు తెచ్చి
నేను మాటల కోటలు
కట్టలేకపోవచ్చు

కానీ జాలి, దయ,ప్రేమ,కరుణ నిండిఉన్న
నా హృదయాన్ని చూసి సంతృప్తమవుతాను

నా మనసు వృక్షాన్ని
వాళ్ళు రాళ్ళతో కొట్టినా
తియ్యని స్నేహ ఫలాల్నే అందిస్తాను

నా ఆత్మీయపు కొమ్మల్ని
వాళ్ళు నిర్దాక్షిణ్యంగా విరిచేసినా
ప్రేమ పుష్పాలనే పంచుతాను

నన్ను అందరిలాగా పుట్టించనందుకు,
అమానుషత్వానికి బదులు
అమాయకత్వాన్ని నాలో నింపినందుకు,
ఆ భగవంతుడికి జీవితమంతా రుణపడి ఉంటాను

వచ్చే జన్మలో ఏమో .. ఏ మేధావిగానో పుట్టి,
ఎంత అనాగరికమైన జీవితాన్ని గడపాలోనన్న
దిగులు మాత్రం వదలదు నన్ను !!!
23.09.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి