పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, సెప్టెంబర్ 2012, సోమవారం

కొండారెడ్డి భాస్కర్ కవిత

అవినీతి వటవృక్షపు ఊడలు,
నరనరాల్లో చొచ్చుకుపోతూ,
ఆకాశంలా విస్తరిస్తున్నప్పుడు.....
అసత్యపు పలుకులు
ప్రియమైన సత్యాలై,
అనుక్షణం హృదయాన్ని,
అగ్నిలా లోభరుచుకుంటున్నప్పుడు......
ఎదుటివాడిని ద్వేషించడమే,
దేశభక్తిగా కీర్తించబడుతున్నప్పుడు...
ఎవరెవరి కారణాలకో,,
లక్ష్యమే తెలియని అమాయకులు బలవుతున్నప్పుడు...
దేశం ముసుగులో,
సమాధులు మాత్రమే
నిర్మించబడుతున్నప్పుడు.........
దేశాన్ని ప్రేమించడమంటే,
తోటి మనిషిని ప్రేమించడం అని తెలిసికూడా,
గుండెలోతుల్లో దాన్ని,
గుప్తనిధిలా దాచేస్తున్నప్పుడు......
ఎందుకని నేను దేశాన్ని ప్రేమించాలి ??
ఒకే ఒరలో వేల విరుద్ధతల ఖడ్గాలను,
ఇముడ్చుకున్న ఈ దేహం,
సాఫల్యతావైఫల్యాలను,
ఎలా విశ్లేషించగలదు, నా పిచ్చిగాని,.
దేశాన్ని ప్రేమించాలనే వుంది,
ఎందుకనే ప్రశ్న,తొలుస్తూనే వుంది.
సంఘర్షణల్లో పడి కొట్టుకుంటున్నందుకో,
సంఘర్షణే లేక బతుకుతున్నందుకో.....
అయినా, ఇదంతా నాకెందుకు...
దేశమనే సంకుచితత్వం,
మెదడుని ఉన్మాదంతో ఊపనంతవరకు,
నా దేశాన్ని ప్రేమిస్తూనేవుంటాను, నేను......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి