పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, ఆగస్టు 2012, శుక్రవారం

నందకిషోర్||ఖబడ్దార్||


అన్నా! మాఫ్జెయ్.
నువ్వు సదివినంత మేం సదవలే.
నీకెర్కినంత మాకెర్కలె.

ఇగ్రహాలిరగ్గొడ్తం
అద్దాల్ పగలగొడ్తం
బస్సుల్ తగలబెడ్తం
నీ బాంచన్..

ఎంతజేసి గద్దె మీద
యేడిబుట్టకపోతే
బతుకుల్ భి అంటుబెట్టుకుంటం!
బాధల్ని తల్సుకుంటనె సస్తం!

ఎంత దుక్కం మా జిందగీల..
ఇంట్ల కూసుండి లైవ్ సూసెటోల్లం కాదైతిమి.
కెమెరాల మొకంబెట్టి తీసెటోళ్ళం కాదైతిమి.
సచ్చేందుకన్న భయపడే
లౌక్యం అసలేలేని దునియా..

ఉద్యమం జిందాబాద్ అనాల్నాయె.
ఉపాసం దీక్షల పండాల్నాయె.
ఎవ్వడో ఒకడొచ్చి యేల్బెట్టిపోతె
లాఠీని,తూటాని సూడాల్నాయె.

ఉరికిచ్చి కొడతాంటె ఉర్కాల్నాయె
రకతంగార్తుంటె అరవాల్నాయె
ఎందుక్కొడ్తండ్రో ఏమన్న ఒక ముక్క
సదువులో ఎక్కడా రాయకపాయె.

బాంచెత్!
మనసులిర్గితె పట్టనోళ్ళకి భి
ఇగ్రహమిర్గితే
నిగ్రహం దెంకపోతది.

గుండెల్పగిలితే సూడని సంత
అద్దాల్ పగిల్తే
యుద్దాల్జేస్తది.

బాంచెత్!
బస్సు విల్వలేదు మా బతుకులకి.
దేహాలకన్నా లోహాలె నయం.
తగలబడ్డంకన్న-
నష్టమెంతో జెప్తరు!

అన్నా! ఏం జేస్తం మేం?
ఊపిరుండి మొసతీయనోళ్ళం.
ఒక్కరోజుల్నే ఫలితం రాదని తెల్సీ
కొట్లాడి కొట్లాడి అలసిపోతం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఉన్నొక్క ఆశా వదల్నోళ్ళం.
ఉబుసుపోకెవడన్న అవసరమెలేదంటే
చెప్పుల్ని మెడకేసి చెప్పేశి వొస్తం.

అన్నా!ఏం జేస్తం మేం?
ఉద్యమాన్ని ప్రాణమనుకున్నోల్లం.
ఉత్తుత్తిగ అని ఎవడన్న అంటే
ఉరుక్కుంటబోయి రైళ్ళకు గుద్దుకుంటం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఊరు సస్తాందని తెల్సినోళ్ళం.
ఊర్కెనే పోరగాండ్లు అరుస్తుండ్రంటే
ఉరికొయ్యలమీద పాటలై యేలాడ్తం.

అన్నా!నీ లెక్కల్ మాక్ తెల్వయ్.
గాంధీతోటే భగత్‌సింగ్‌ని సదివినం.
నక్సలైట్లు గిదేపనిచేస్తే
ఏమంకితం జేసినవో అడగం.

అన్నా!నీ లెక్కల్ మాక్‌దెల్వయ్.
నీ దోస్తొకడు సస్తే గోదార్ని లంజన్నవ్.
అది మా అమ్మ.
బలిదానమయ్యెటోళ్ళు మా తమ్ముండ్లనుకున్నం.
వందలమందిసస్తే కోపమెంతొస్తదో
నీకసలే తెలవదని అనుకోలేం..

అన్నా!బరాబర్ ప్రజాధనమే..
కాదన!
ఏడ్వందల ఎనభైని ఎంతబెట్టి గుణిస్తవో చెప్పు.
మిగిలిన పైసల్
మా రక్తమమ్మి తెచ్చిస్తం.

అన్నా! మళ్ళొకసారిజెప్తున్న..
కత్తుల మీద కవాతుజేస్తున్నోళ్ళం.
ఖబడ్దార్..!
విధ్యార్ధులం-
విషపు గొంతుకల్ని తొక్కనీకి
ఏ సదువు అక్కర్లేనోళ్ళం.

అన్నా!నీకిష్టమొచ్చింది రాస్కో.
మమ్మల్ని మాత్రం బద్నాంజెయ్యకు.
బస్సంటే మాకు ఇష్టమే..
సచ్చిన మా తమ్ముడంటే శానా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి