పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

కట్టా శ్రీనివాస్ || వర్షం వెలిశాక.||


ఊగి ఊగి ఆగిన
మొరటు తూగుడు బల్లలా
కురిసి కురిసి వెలిసిన వర్షం.

చూరు చివరి నుండి
ఒక్కో చినుకు రాల్తోంది.

చెదిరిన స్వప్నాల్లాంటి గందరగోళంలో
ఉక్కిరి బిక్కిరయిన భూమి
ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నట్టు
వీస్తున్న ఓ మంద్ర పవనం.

ముడి చెదిరిన జడలా
రెప రెపలాడుతున్న కొబ్బరాకుల సవ్వడి.

చీకటి బాహువుల్ని చాచి
యిప్పటిదాకా స్వైర విహారులైన మేఘాలు.
ఓపిక లేక ఉస్సురంటూ ఓ దిక్కుకి వాలి సోలిన వైనం
కూనిరాగాల పాటలా మదిలో కదుల్తూ
నిద్రపోతున్న భావాల్ని తట్టిలేపితే
పల్లవి లేని చరణాలు, చరణాలే లేని దేహంలా
స్తబ్దంగా పయనాన్ని ఊహల్తో నెమరేసుకుంటూ
గాంభీర్యాన్ని బ్రేవుమని తేన్చుతున్నాయి.

*20-07-2012
సిరి.కట్టా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి