పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జులై 2012, మంగళవారం

డా.కాసుల లింగారెడ్డి || తుపాకి కన్నుకు తెలుసు ||

అవును, నిజమే
గాయం చేసిన బుల్లెట్‌కు కాయం చిరునామా తెలవదు
నువ్వు అభివర్ణిస్తున్న దేశ అంతర్గత పెనుముప్పో
అనాదిగా అడవినీ అవనినీ
నమ్ముకున్న ఆదివాసో
కాయమెవ్వరిదన్నది కసిగా దిగిన బుల్లెట్‌కు
తెలవదుగాక తెలవదు
నిజం.. ఎక్కుపెట్టిన తుపాకి కన్నుకు తెలుసు
ఆ కన్నును తన కనుసన్నల్లో ఆడించుకునే
రాజ్యానికి తెలుసు
అవును.. నిజమే
బుల్లెట్ ఆవులపల్లి అమాయక విద్యార్థిని గుర్తించదు
అడవిని పోడుగొట్టి
బతుకు గింజ పండించుకున్న రైతును గుర్తించదు
విత్తనాల పండుగలోని
వైవిధ్య జీవనవిధాన్ని గుర్తించదు
ఆత్మీయబంధాల ఆకలి పంపకాల్ని గుర్తించదు..
రాజ్యసర్కస్ మాస్టరే అధికారిక నక్సలైట్ ముద్ర వేస్తడు
మనిషి రక్తపు పొలినారగించే సాయుధ మృగాలను ఆదేశిస్తడు

అవును.. నిజమే
బుల్లెట్ మాయా కన్నుకు
సాల్వాజుడుం అత్యంత సాధుజంతువే
పేదపిల్లల వైద్యుడు తీహార్‌జైళ్ళో శిక్షించదగినవాడే
ఆరులేన్ల వనరుల దోపిడిమార్గం అభివృద్ధి చిహ్నమే
వేదాంత జిందాల్‌లకు జై కొట్టకపోవడం రాజద్రోహమే
రాజ్యం రాకాసి కళ్లకు
ఇక్కడ మనిషన్న ప్రతివాడు మావోయిస్టే-
ఘనతంత్ర సాయుధ బలగాలకు
ఆదివాసీ నిరాయుధులంతా కాల్చి చంపదగినవారే



* 09-07-2012

1 కామెంట్‌:

  1. లింగారెడ్డిగారూ,
    కవులు సమకాలీన చరిత్రని, పాలకుల దుర్మార్గపు ఆలోచనలనీ ఇలా తప్పకుండా రికార్డు చెయ్యాలి. భావితరాలకి చరిత్ర ఏమైనా పాఠాలు చెప్పగలిగితే ఇలాంటి వాటినుండే. అధికారం అవకాశం గల ప్రజలు స్వార్థపరులై పాలకులపాపాలలో భాగం పంచుకుందికి సిధ్ధపడుతున్నప్పుడు, ఇలాంటిపరిణామాలే ఎదురౌతాయి ఎప్పుడూ. చాలా చక్కగా చెప్పారు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    రిప్లయితొలగించండి