పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జులై 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్॥సాయంత్రం ఏడు దాటిందా..॥

సాయంత్రం ఏడు దాటిందా గుండె ఏదో కీడు శంకిస్తూనే చెట్ల మధ్య
దొర్లుతూ ఉంటది
ఏమి జరుగుతుందో ఏమో అక్కడ తెలీదు
ఎన్ని కలలు కూలిపోతాయో తెలీదు
ఆ రాత్రంతా మొద్దుబారి శవంలా వాసనేస్తదో తెలీదు
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు ఎడమ కన్ను అదురుతూ ఉంటది

రణగొణ ధ్వనుల మధ్య మూడు గిర్రల బండి నెమ్మదిగా మాట్లాడుతూ ఉరుకుతది
అప్పటి దాకా ప్రియుని సమక్షం లో ఓలలాడిన గవ్వ కళ్ళున్న గువ్వ
చెవి జూకాల సడిలో అతడి ప్రేమ తాలూకు గుసగుసలు
ఎవరికీ వినపడకుండా దాచుకుంటూ
నాతో మాట్లాడుతూ ఎగిరిపోవాలని ఒకటే ఆరాటం దానికి
నేను మాటల పంజరాన్ని అని అప్పుడే తెలుసుకున్నట్టు
ముళ్ళ కంచెలా తన రెక్కలకు గుచ్చుకున్నట్టు
గుల్బర్గా పాత గోడల మీది తన స్వప్న సీమను నేనే కూల్చేసినట్టు
అంబర్ పేట ఆకాశాన్ని నేనే చించేసినట్టు
ఒక్కసారిగా పర్దా లోపల కొన్ని పాములు బుసకొడుతాయి
అంతే! మాటల తీరే మారిపోతుంది
చెట్లకింద చీకటిలో బిక్కుబిక్కుమని దాక్కున్న నల్ల కుందేలు పిల్లలా బెంగటిల్లుతాను
నేరం ఏమి చేశానో తెలియక వొంటినంతా తడుముకుంటాను

సాయంత్రం ఏడు దాటిందంటే నేను అల్లుకున్న పాట పగిలిపోతది
ఆమె పిలుపు కోసం ఎదురు చూసిన కుందేలు గుండెలో విషపు ముళ్ళు గుచ్చుకుంటాయి
నల్లని చీకటిని నా మీదికి విసిరి మూడు గిర్రల బండిని ఒక్కసారిగా దిగెసి వెల్లిపోతుంది
నేను కాల్లు తెగిన కుందేలులా నెత్తురు కార్స్తూ ఎండిన కొమ్మల నడుమ పడిపోతాను
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు నాకు చావు ముంచుకొస్తది
*10.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి