పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

నంద కిశోర్ || ‎66G ||

అరె భాయ్!
చూసావా ఎపుడన్నా?
చౌమహల్లాలోని కత్తుల్ని,తుపాకుల్ని
అందానికే అతిశయమనిపించే
అలనాటి వైభవాల్ని,
అఫ్జల్‌మహల్లోని దీపాల్ని,సోఫాల్ని,
చెదరకుండా కూర్చున్న
నవాబుల జ్ఞాపకాల్ని..

భాయ్!
విన్నావా ఎపుడన్నా?
వింటేజ్‌కారుల్లోంచి మోగేటి హారన్‌ని,
అటుగ వెళ్ళే గాలి
మోసుకెళ్ళే సంగీతాన్ని,
రాణుల గుసగుసల్ని,రహస్య భాషల్ని,
ఎవరికి వినపడని సన్నటి ఏడుపుల్ని,
అందమైన కొలనులో
హంసల గానాన్ని..

చూస్తున్నావా నువ్వు?
హైకోర్టుని,ఉస్మానియాని,
సందేశాల్లేని పావురాల్ని,
పాతబడ్డ నయాపూల్ని,నాగరికతని
మురికినీళ్ళలో తేలి
ఊపిరాడని మూసీనీ,
తీరాన్ని మిగల్చకుండా
కొట్టుకుపోతున్న చరిత్రని..

వింటున్నావా ఎపుడన్నా?
రోగుల అరుపుల్ని,
న్యాయంలేని వాదనల్ని,
ఏడ్చే గడియారాల్ని,పాడని మసీదుల్ని,
సిటికాలేజిలో
తన్నుకున్న నినాదాల్ని,
ఫుట్పాత్ దుకాన్లో
ముసల్మాన్ గొంతుని..

ఆబిడ్స్ లో చెట్ల నీడలు
అసెంబ్లీకి వలసెళ్ళాయి.
నాంపల్లి విద్యాలయంల
సురవరంకి గిరాకి లేదు.
మెహదీపట్నం అంచులో
సగం భూమి సైన్యం తింది.
లంగర్‌హౌస్లో ఆగేదెవడు?
బ్యాచులరే అయ్యుంటాడు.

గోల్కొండలో ఉన్న రాళ్ళన్ని
కూలలేక కూలబడ్డయి.
రామదాసు బందికానలో
రాముడింక బయటకి రాలె.
సప్పట్లు కొట్టినవంటే
బూతులేవో ఇనబడుతున్నయ్.
కోటపైకి ఎక్కిసూస్తివో
నగరమంత పాతబడ్తది.

గిదంతా నీకెందుకులేగాని,
'అమాయకుడా'..
నీకు నచ్చేటి పాట పాడనా?
॥పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ॥

(*66G గోల్కొండ నుండి శాలిబండ పోయే బస్సు నంబరు. ఈ రూటులో చార్మినారు తాకదు.)
*15-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి