పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, మార్చి 2014, ఆదివారం

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ||నేను ....|| నేను మాట్లాడకపోతే ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్య రోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శ్వాసించకపోతే గాలులు స్థంభించిపోతాయి ........ నేను అనంతాన్ని నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని నేను కిమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును, గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని, నేను పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును, నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని, నేను దద్ధరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని.... నేను మరీచిని, నేను లోక పునర్నిర్మాణం కోసం వెన్నెముకనిచ్చిన దధీచిని. నేను చేతస్సును, నేను ప్రజాశ్రేయస్సు కోసం ఆవిష్కృతమవుతున్న హవిస్సును... నేను కుసుమపేశల శిరీశను, నేను జిగీషను నేను కవిత్వపు వస్త్వైక్యాన్ని, నేను కవి భావనలోని ఏకాత్మతను నేను ప్రపంచపు చైతన్యాన్ని, మానవ హృదయాశావధి నిండిన భావనాత్మక ఔన్నత్యపు ఉనికిని.. నేను భీరువును, నేను ధీరుడిని.... నేను భీకర ఆయుధాన్ని, తండ్రి యెదపై ఆడే చిన్నారి నవ్వుల శీకరాన్ని... నేను బలవంతుడి ధాష్టీకానికి తెగిపడ్డ మెడను.. నేను చలిచీమల చే కట్టబడ్డ దుర్భేద్యపు గోడను... నేను మానవాంతర్గత సంద్రపు కల్లోలాన్ని.. నేను తిమిరలోకపు గుండెలు చీల్చిన ఉదయ శరాన్ని... నేను యుద్ధ సేనాని రథ కేతనాన్ని.. నేను సమాజంలోని అధిపత్యవాదులచే కుంచించబడుతున్న గౌరవమనే వేతనాన్ని... నేను మనిషి గుండెలో విరుస్తున్న వాత్సల్య శిల్పాన్ని.... నేను బండరాళ్ళ ను చీల్చుకుని మొలకెత్తుతున్న వికసిత పుష్పాన్ని.... ... ... ... నేను గాలిని.... నేను వెలుగును... నేను స్వాంతనను... నేను చైతన్యాన్ని.. నేను మనిషి మస్తిష్కంలో ఇంకా ఇంకని మా న వ త్వ పు జా డ ను.....

by Tarun Chakravarthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXm9E

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి