పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

కవిత్వంతో ఏడడుగులు





హొరేస్ హోలీ అన్న అమెరికను కవి కవితాసంకలనం "Divinations and Creation" లోనిది ఈ కవిత. ఇందులో మనం గమనించవలసిన చాలా విషయాలు ఉన్నై. ప్లేటో చెప్పిన "Poetry is Divine Madness" అన్నదే ఇక్కడ కవి చెబుతున్నాడు. అంటే పరోక్షంగా, కవి అటువంటి భావావేశంలోనే కవిత రాయాలి.... అలవాటుగానూ అలవోకగానూ రాసిపారేసి అది కవిత్వం అనేకంటే. తిలక్ చెప్పిన " ఏది చెప్పినా అది నీలోంచి రావాలి, చించుకుని రావాలి" అన్నభావన తాత్పర్యమూ ఇదే. ఆ ఆర్తిలోనే కవిత రావాలి. "కవి ఒక సృష్టికర్త కాదు. ఒక సాధనం. ఒక మీడియం. ఒక వాహిక," అని కవి భావము.

ఆ భవ్యకవితావేశంలో మనమాటలు మనకే కొత్తగానూ చిత్రంగానూ ఉంటాయి. నిజానికి మనకే ఆశ్చర్యం వేస్తుంది నేనేనా ఈ మాటలు రాసింది అని. అవి అప్పుడే ఎందుకు చెప్పాలి అన్నదానికి కూడా కవి సంజాయిషీ ఇస్తున్నాడు. ఈ మృత్తికతో కలిసి పాడవకముందే... అని. అంటే కవిత్వాన్ని edit చేసుకోవద్దని కాదు. కవిత్వం అలౌకిక మని కవిభావన. అంటే ఎప్పుడైతే లౌకిక భావన దానికి చేరువౌతుందో, దానిలోని నిర్భీతి, దాని అలౌకికత్వమూ పోతాయి. అక్కడ కవి చెప్పదలచుకున్నదానికంటే, మెప్పించదలుచుకున్నదానికి ప్రాధాన్యత వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా చెడిపోతుంది. ఇక్కడ ఒక చక్కని ఉపమ వాడేడు కవి. "రేపటిలా" అని. ఇది కాలానికి ప్రతీక. కాలం అన్నిటినీ చదునుచేసేస్తుంది. రేపుమనముందుకి వచ్చి కనిపించేవి ఎప్పుడూ, కాలం చదునుచెయ్యగా మిగిలినవే.

అలాగే చివరి చరణంలో ఒక చక్కని మాట చెప్పేడు. మనం రాసిన కవిత్వంలో సరుకు ఉంటే అది నిలబడుతుంది. కీర్తింపబడుతుంది. లేకపోతే పోతుంది. నేను మాత్రం "ఒక ప్రశాంతమైన కొలనులో విప్పారిన కలువలా నిద్రలోకి జారుకుంటాను" అంటున్నాడు. అంటే, కవిత్వం అనుభూతిచెందినప్పుడు, అదిరాసినప్పుడు వచ్చిన ఆనందమే దాని ప్రతిఫలం. అది ఉంటుందో లేదో మన బాధ్యత కాదు. దాన్ని నిలబెట్టవలసిన అవసరమూ లేదు. మాహాకవుల కృతులే కొన్ని కాలం ధాటికి నిలబడలేనప్పుడు అల్పులం మనమనగా ఎంత? ఆ ఎరుక మనల్ని కవిత్వానికి నిబద్ధులుగా చేస్తుంది. మన కృతులపట్లా, కృషిపట్లా అలవిమాలిన మమకారం నుండి దూరం చేస్తుంది. ఒక రకంగా పిల్లలకి ఆస్తిపాస్తులు సంపాదించిపెట్టలని తాపత్రయపడే తల్లిదండ్రుల మనోవేదనలాంటిదే మనకవిత్వంకూడా కాలానికి నిలబడాలని పడే తాపత్రయం. మనిషిని ప్రశాంతంగా చావనివ్వదు.

Foreword

“O That I be
As Oak to the carver’s knife, or tougher stone,
A moveless monolith,
Scored deep with secret hieroglyphs
Whence men will slowly, letter by letter, spell
Enduring exultation for their lives!
For I am a witness to a miracle
That opens a new mad mouth
Quick with astonishment of ardent words
Not mine but prophets to this wonder
That must be testified all new and strange
And ere it stale be kneaded in our clay,
Since memory would betray what must remain
Ever before us like tomorrow.
Of myself
I should not otherwise heap words
Upon the garbage of our daily gossip
But let you pass unhailed
Myself preferring to slip within a dream
Like a stretched lily in its quiet pool.”
.
    By Horace Holly

Divinations and Creation
Link: (http://archive.org/stream/divinationscreat00holl#page/1/mode/1up)


తొలిపలుకు
.

ఆహ్! నేనొక నిపుణుడైన పనివాడి కత్తికింది
ఒదిగే మెత్తని ఓక్ చెట్టు మానునో,
రహస్యచిత్రలిపిలో లోతుగా చెక్కబడిన
చెదరని ఏకశిలనో అయితే బాగుణ్ణు.
అప్పుడు అక్షరం అక్షరం నెమ్మదిగా చదువుకుంటూ
ప్రజలు జీవితకాలం ఆనందంగా ఉండగలుగుతారు.

ఎందుకంటే నేనొక చోద్యానికి ప్రత్యక్ష సాక్షిని
ఆ ఆశ్చర్యంలో ప్రవక్తల నోట వచ్చే భవిష్యవాణిలా
నాది కాని ఒక ఉద్వేగమైన భాష వెలువడుతోంది
అది చాలా కొత్తగానూ, చిత్రంగానూ ఉందని చెప్పక తప్పదు.
అది ఈ మృత్తికతో కలిసి పాడవకముందే ప్రకటించాలి
ఎందుకంటే, జ్ఞాపకం ఎప్పుడూ మోసం చేస్తుంది
నిత్యం మనముందు కనిపించే రేపు లా
ఏది మిగలాలో దాన్ని నిర్దేశిస్తూ.

నా గురించి
నేను గొప్పగా చెప్పుకోకూడదు
రొజూ మాటాడుకునే పోచికోలు కబుర్లు మినహాయించి .
ఓ నా కవితా! నిన్నెవ్వరూ అభినందించకపోతే పోనీ;
నేను మాత్రం నిద్రలోకి జారుకుంటాను
ఒకప్రశాంతమైన కొలనులో విప్పారిన కలువలా.
.

హొరేస్ హోలీ,
(April 7, 1887 - July 12, 1960)
అమెరికను కవి


                                                                                                              ______నౌడూరి మూర్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి