పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

గుబ్బల శ్రీనివాస్-క్షురకుడు
 


అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తరువాత బహుజన వాదం పేరుతో అణగారిన వర్గాల కవిత్వం(Poetry of appressed groups)వెలువడింది.నిజానికి ఇది వచ్చిన వేగం ఆకాలానికి అనేక చర్చలు తీసుకు వచ్చాయి.జూలూరి గౌరి శంకర్"వెంటాడే కలాలు"తీసుకువచ్చారు.ఆ తరువాత కూడా చాలామంది కవులు తెచ్చిన సంపుటాలున్నాయి.

చరిత్ర గతిలో వచ్చిన ఉద్యమాలవల్ల ఈ కవిత్వం తన గొంతును మార్చుకుంది.తరువాతి కాలంలో వచ్చిన ప్రపంచీకరణ (Globalisetion)కవిత్వం లో ఒక ప్రధాన పాయగా ప్రవహించిన కుల వృత్తుల కవిత్వం ఈ వర్గాలదే.దానికి కారణం ప్రపంచీకరణ వల్ల ఆయా వృత్తుల విధ్వంసం జరగటమే. ఆతరువాత తెలంగాణా ప్రాంతీయ ఉద్యమంలోనూ ఈ తాత్వికత పాత్ర గమనించదగింది

గుబ్బల శ్రీనివాస్"క్షురకుడు"మానవీయ స్పందనను కూర్చుకున్న కవిత.ఔపయోగిక దృక్పథంతో జీవితాన్ని పరిశీలించిన కవిత.ఇందులో అంశాత్మక పరిశీలన(Case study)ఉంది.నిజానికి ఇలాంటి నిర్మాణం దీర్ఘ కవితల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

"నెరిసిన తలలకు మాసిన ముఖాలకు
కత్తి పట్టి వైద్యం చేస్తాడు/వైధ్యుడు కాదు"

"రాక్షస రూపాలను అందమైన
నగిషీలు చెక్కుతాడు/శిల్పి కాదు"

చివరి భాగం వల్ల వాక్యం పొడుపుకథ నిర్మాణాన్ని సంతరించుకుంది.మనసును హత్తుకునే మార్దవమైన వాక్య భాగాలూ ఉన్నాయి.ఇవి ఒకింత కళాత్మకంగా కనిపిస్తాయి.

"మనసు లగ్నం అయితే/వేళ్ళు విన్యాసం చేస్తే
క్రమ పద్ధతిలో అమిరిపోతాయి/జులపాలు
అవి ప్రేమిక ఊహల్లో నీలి మేఘాలు"

"నిద్దరోతున్న జనాన్ని బద్ధకం కమ్ముకున్న లోకాన్ని
డప్పు దరువుతో చైతన్యం నింపుతాడు"

"తనువు చాలించి చివరి మజిలి
చేరుతుంటే/విచార గీతం ఆలపించి
మరుభూమి చేరుస్తాడు ఆత్మీయుడిలా "

జీవితాన్ని గమనించిన తీరు బాగుంది.మంచి అంశాలని కవిత్వీకరించారు.జీవితాన్ని అనేక భావాభి వర్గాలనించి చూడటం కూడా కనిపిస్తుంది.వచనంలో ఇంకా తాదాత్మ్యత అవసరమనిపిస్తుంది.సాధనే క్రమంగా ఆ మార్గాన్ని ఉపదేశిస్తుంది.మంచికవిత అందించినందుకు శ్రీనివాస్ గారికి అభినందనలు.
 
 
                                                                                                                                                    ______________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి