పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, అక్టోబర్ 2012, బుధవారం

కామేశ్వరరావు డి //యవ్వన పరిమళం//


అప్పటి దాకా ఎక్కడుందో
చెప్పా పెట్టకుండా చప్పున వచ్చేస్తుంది వసంతం...
గుప్పుమంటుంది కొత్త ప్రపంచం...

అమ్మాయిల కళాశాలలా కళకళలాడుతూ పూలతోట.
మనసంతా మెత్తని రంగుల గుబాళింపు
యవ్వన పరిమళం కొత్త పరిచయమౌతుంది...

ప్రేమకు అర్థం వెతుక్కుంటుంది గుండె...

గుబులుగా దిగులుగా మూగపోయిన పాట
గుబురుల్లోంచి గుండె మీదకొచ్చి వాలుతుంది..
'కుహూ' అన్న అరుపు,
'రావా' అన్న పిలుపవుతుంది...
రెండుగా ఎదిగిన ఒకటి,
ఒక్కటిగా ఒదిగి కరిగిపోతుంది...

ప్రపంచానికి దూరంగా మత్తెక్కి ప్రవహిస్తాయి ఊహలు...
ఎండా వాన వణుకు వెన్నెల
అన్నీ కంటి రెప్పల అంచుల మీద నించి జారిపోతాయి....

స్వప్నించిన క్షణాలు - కళ్ళు తెరిచిన క్షణం...
ఎదురుగా
రాలిన ఆకులు పరిచిన వాస్తవం...

ప్రతి ఆకు కిందా ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో నిశ్శబ్దాలు,
ఆనంద విషాదాల తూర్పు పడమరలు...

తలెత్తి చూస్తే...,
ఒళ్ళంతా తొడిమలు విడిచిన గాయాల గుర్తులతో
నిశ్చల సమాధిలో నిలబడ్డ యోగిలా చెట్టు..!
మళ్ళీ వచ్చే వసంతం కోసం,
అది తెచ్చే మధుర వేదన కోసం..

అవును....
కాలం
తీయని గాయాల ఆగని గేయం....!!


29-10-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి