పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఆగస్టు 2012, సోమవారం

బి వి వి ప్రసాద్ || గమనించముగానీ ||

గమనించము కానీ
 ఒక దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
 ఇల్లు కూడా కాసేపు మనని అతిథిలానే చూస్తుంది

ఇంటి గోడలూ, వాటి వెలిసిన రంగులూ

సామానూ, అవి సర్దుకొని ఉన్న విధానమూ

మన మనుషుల మాటలూ, ప్రవర్తనా

వాకిట్లో ఇవాళ పూసిన పూలు కూడా

ఎవరీ మనిషి అని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి

మనని మనకు కొత్తమనిషిని చేస్తాయి


గమనించము కానీ

గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా

కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది

ఆక్షణమే, ఎవరో ఎక్కడినుండో ప్రపంచాన్ని తెచ్చి మన చుట్టూ పరిచినట్లుంటుంది

అపుడు మనం

మొదటిసారి శ్వాసిస్తున్నట్లు కొత్త ఊపిరి గుండెలనిండా నింపుకొంటాము


మేలుకొన్నపుడూ,

ఇంటికి వచ్చినపుడూ

కాసేపు మనలో పసిపిల్లల అమాయకత్వమేదో గోడమీది నీరెండలా పారాడుతుంది


తామేమి చేస్తున్నాయో తమకు తెలియకుండానే

కఠినమైన ప్రపంచాన్ని కోమలమైన రంగులతో నింపుతున్న

పూలలోని మృదు సౌందర్యస్పృహలాంటిది ఏదో

మనలో లీలగా, దూరం నుండి వినవస్తున్న పాటలా

వాగు ఇసుకపై మెరుస్తున్న పలుచని నీటిపొరలా చలిస్తూ ఉంటుంది


గమనించము కానీ

మన ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ

కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ

దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి

ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు

మన లోపలికి ఇంకుతూ ఉంటుంది.

*05-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి