పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, ఆగస్టు 2012, సోమవారం

శ్రీ ||''నిషేదిత చరిత్ర''||

విప్లవం ఇప్పుడొక
డస్సిపోయిన నినాదం
రివొల్యూషన్ ఇంకా
రొమాంటిక్ కలగానే ఉంది
అందుకే నిన్నిపుడు
నింగికెగసిన తారవనో
విప్లవాగ్ని ధారవనో
కీర్తించడం లేదు

ఏం సాధించావ్ కిషన్ జీ
ముప్పైదేళ్ళు అడవికే అంకితమయ్యి
కనీసం అమ్మని కూడా కలవకుండా
చెట్లమ్మటా పుట్టలమ్మటా తిరిగి
ఏం బావుకున్నావయ్యా
తెలంగాణాలో నువ్వు వెలిగించిన
చైతన్య దీప్తులు ఎక్కడా
కానరావడం లేదు లే
గ్లోబలైజేషన్ వెలుగుల ముందు
నీ కాగడా వెలవెలబోతుంది చూడు
విద్యార్థి ఉద్యమాల కాలం
నీ తరంతోనె అంతమైపోయింది

అసలు తిరుగుబాటు తత్వం
మాకెక్కడిది...
మెటీరియలిస్టిక్ బతుకు
బతుకుతున్న మాకు
గతితార్కిక భౌతిక వాదాలు
ప్రజాతంత్ర పోరాటాలు
సోషలిస్టు సిద్దాంతాలూ
అర్దం కావు ఎందుకంటే
మేము చదివిన
చరిత్ర పుస్తకాల్లో
సిక్కోలు పోరాటం,జగిత్యాల జైత్ర యాత్ర,
తెలంగాణా సాయుధ పోరాటల
ప్రస్తావనే లేదు
ఇకా మర్క్సిజం, మావోఇజం
మాకెక్కడ అర్దమవుతాయ్
అయినా ఇప్పుడున్నది ఒకే ఇజం
కెరీరిజం..

ప్రశ్నించడం గురించీ
ప్రత్యామ్నాయాల గురించి
ఆలోచించనే రాదు మాకు
నువ్వెంత చెప్పినా
శాంతిబద్రతల కోణం నుంచి తప్ప
నిన్ను వేరె విధం గా చూడలేము
ఎందుకంటే ఇప్పుడు మేము
సామ్రాజ్య వాద భావ దాస్యం లో
హాయిగానె బతుకుతున్నాం
బహుళ జాతి కంపెనీలకి
బానిసలమైనా మేము
సుఖం గానె ఉన్నాం
మా జీతం మాకొస్తుంది
మా ఇల్లు మేము కట్టుకున్నాం
రేట్లు ఎంత పెరిగినా
కొనగలిగే శక్తి ఉంది
ఇక ఎవరు ఏమైతే మాకెందుకు

నీ మరణం కించిత్ బాదని
కూడా కలిగించడం లేదు
అయినా ఎవరికోసం చచ్చిపోయావ్
ఈ భూమి మీద ఇంకా
ఆకలికి ఏడ్చేఅ వాళ్ళున్నారా?
హౌ ఫన్నీ
మన జీడీపీ చూడు
ఎట్లా పరుగులుపెడుతుందో
అడవిలో ఏముంది
రాళ్ళూ, నాగరికత తెలియని
మనుషులు తప్ప
ఒక్కసారి హైదరాబద్ వంక చూడు
ఎటు చూసినా అంతా అభివ్రుద్దే కనిపిస్తుంది

అయినా మీ మార్క్సే చెప్పడట కదా
మానవ సంబందాలన్నీ
ఆర్థిక సంబందాలేనని
ఇప్పుడు మేము కూడా
దానినే ఫాలో అవుతున్నాం
మాకు నష్టం లేనంత వరకు
ఎవడు ఏమైపోతే మాకేంటి
మా లాభం కోసం
పక్క వాడు చస్తున్న పట్టించుకోం
ఇప్పుడు ఇదే
ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్

సమాజం సున్నితత్వాన్ని
కోల్పోయింది కామ్రేడ్
క్రైం న్యూస్ ని కూడా వినోదం గా
మార్చిన మా టీవీ చానళ్ళకి
నీ చావు వార్త
ఒక రోజు బ్రేకింగ్ న్యూస్
ఎవడికి వాడు
ఆ ఉత్సుకతా, ఉత్కంఠని
ఎంజాయ్ చేసి ఎప్పటిలానె
ఎవడి పనుల్లోకి వాడు హాజరు.
ఎవడికి పట్టింది నీ చావు
అందరికీ తెలుసు
నిన్ను అన్యాయం గా మట్టుబెట్టారని
అయినా ఎవరం నోరెత్తం

కాబట్టి కామ్రేడ్
ఇప్పుడు నీ చావుని
గ్లోరిఫై చెయ్యదల్చుకోలేదు
బలవంతుడిదే రాజ్యమన్న
ఆటవిక నీతి
కొనసాగినంత కాలం
నువ్వెలాగూ చరిత్ర పుస్తకం లో
నిషేదించబడ్డ పేజీవే
నిజం గా నువ్వు కలగన్న
ఆ విప్లవం ఉదయించిననాడు
ఆ నిషేదిత పుటల్లోని
అమరుల చరిత్ర పైనే
మరో ప్రపంచపు పునాదులు
మహోద్రుతం గా పైకి లేస్తాయి
అంతవరకు లాల్ సలాం
--శ్రీ
*12-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి