పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జులై 2012, బుధవారం

జిలుకర శ్రీనివాస్ కవిత

కాలానికి ఆవల వెలిగే కవితా దీపానివి

 ఆ రోజు చెట్టు నీడలో నిల్చోని నీతో మాట్లాడింది ఇంకా గుర్తే నాకు
అబ్బ! ఇవన్ని మీకెలా గుర్తుంటాయని కదా నీ ఆశ్చర్యం
నీ చూపుల లోగిలిలో కూర్చున్నాక మరో ద్యానం ఉందా నాకు
తుడిచేసుకోడానికి నువ్వో పిచ్చి గీతవి కాదు
కాలానికి ఆవల వెలిగే కవితా దీపానివి

పొద్దునే లేస్తానా! గుంజకు కట్టేసిన లేగ దూడ తల్లిని చేరేందుకు ఆరాట పడ్డట్టు
చేతులకు రెక్కలు మొలిచి ఎగురుతూ నీ దరికి చేరుకుంటాను
నీ తల వెంట్రుక జారి పడిన చోట బంగారు తీగలేరుకుంటాను
నువ్వు జాగ్రత్తగా చదివి పెట్టిన పుస్తకంలో రెండు మూడు శబ్దాలు దొంగిలిస్తాను
ఏంటి మీరు! మీ రాతలేవీ అర్థం కావటం లేదని కదా నీ ఫిర్యాదు
ఆ రోజు చెట్టు నీడలో నీతో మాట్లాడిన ఊసులే కదా నేను రాసిన వొంకర వాక్యాలు

ఆ రోజు చెట్టు కింద ఎర్రటి ఎండలో నీ పెదాల మీద పూసిన పువ్వుల సవ్వడి విని
ఒట్టేశాను నీ ప్రేమ నింగిలో ఎగిరే తావు లేని నాడు
రెక్కలు తుంచుకొని దిక్కులు కూల్చుకొని పిడాత విషంపుచ్చుకొని నేల రాలిపోతానని!
ఎందుకంత పిచ్చి అని కదా నీ రుసరుసలు
ఆసుపత్రి గోడల మధ్య నన్ను చూసి కన్నీరై పొంగిన నీలోని నదీ ప్రవాహాన్ని అడుగు
ఊపిరికి నీ కను రెప్పల మెత్తటి తడికి ఉన్న విలువను కూడా నేనివ్వనని సాక్ష్యం చెప్తది

ఆ రోజు చెట్టు నీడలో నేను పాడిన పాట నీ మెడ వొంపుల్ని ఇంకా తాకుతూనే ఉంటది
నాలో పచ్చని చెట్టు తీయటి పాటల్ని పూస్తుంది నీ తెల్లటి పాదాలను కడిగేందుకు
నీలోని చిగురాకుల చెట్టు కొమ్మలు కొత్త కలల్ని కలల మీది అలల్ని నా గుండెకు మొలిపిస్తున్నాయి
చిరాకులో అప్పుడప్పుడు కొన్ని రెమ్మల్ని తెమ్పేసి కసురుతావు కాని
ఏమై పోతానో అని ఒకటే దిగులుతో చెట్టు కిందే కూర్చొని నా జాడ కోసం దేవులాడుతావు
*****
ఆదివారం,2.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి