పేజీలు

13, జూన్ 2014, శుక్రవారం

Lanka Kanaka Sudhakar కవిత

గొల్లవాని ముద్దు ---డా.యల్.కె.సుధాకర్ అప్పుడే పుట్టిన గొర్రెపిల్లని-వెచ్చగా కంబళీలోచుట్టబెట్టినట్టు చాచిన చేతుల్తో అతడు నన్ను ప్రేమగా వాటేసుకున్నాడు.. పొంగిపొరలే ఆనందపు కెరెటాలమీద పడవల్లేవూగిపోయాడు.. అతడి కన్నుల్లో ఏ భాషకీ అందని ఆనందవాక్యాల మిలమిల.. చాన్నాళ్ళ తర్వాత ఆప్తుణ్ణి కలుసుకున్నప్పటి ఆనందాన్ని తర్జుమా చేసేభాష పేరేమిటీ?? ఎన్నాళ్ళయ్యింది బాబూ మిమ్మల్ని చూసి!!అన్నాడు ఒకసారి చూడడానికీ మరోసారి కలుసుకోడానికీ మనిషికీమనిషికీ మధ్యనున్న దూరానికి కొలమానమేమిటి? అతడి హృదయపూర్వక పరామర్శకి సమాధానంగా మౌనంగా నవ్వాన్నేను ప్రేమ ప్రవాహానికటూఇటూ గుండెనీ గుండెనీ ముడి వేయడానికి మౌనాన్ని మించిన వారధేముందీ?? అమ్మగారికి దండాలన్నాడు పిల్లలు బావున్నారా ఆంటూ వాకబుచేసాడు.. విస్తరించిన పచిక మైదానాల్లో-సూర్యాస్తమయవేళ చెదిరిపోయిన గొర్రెలన్నీ ఒక చోటికి చేరుకుంటున్నట్టు అతడి మొదటి పరిచయం తాలూకు పాతజ్ఞాపకాలు నన్ను చుట్టుముడుతుండగా ఖచ్చితంగా అతడు మామూలు మనిషి కాదన్న విషయాన్ని- మళ్ళీమరోసారి రుజువు చేయడం కోసం ఆస్తులేమైనా కూడబెట్టారా అని అస్సలడగలేదు డబ్బు సంపాయిస్తున్నారా అని ఆరాలు తీయలేదు ప్రపంచాన్ని ఆశీర్వదించే అపురూపమైన కళ్ళతోచూస్తూ మీరు చల్లగుంటారు బాబూ!!అన్నాడు ఆపుకోలేని ఆప్యాయతతో ఆర్తిగా నా ముంజేతిని ముద్దెట్టుకున్నాడు కృష్ణుణ్ణీ క్రీస్తునీ ముద్దాడిన లౌక్యమెరుగని అమాయకపు పెదాల స్పర్శతో అతడి చేతుల్లో నిజంగానే కొన్ని క్షణాలు నేను గొర్రెపిల్లనై ఒదిగిపోయాను.

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pRRnDP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి