పేజీలు

10, జూన్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

రేణుకా అయోల -నా నడకలో నగరం ______________________________________ యూంగ్ సాహిత్యానికి రెండు పార్శ్వాలుంటాయన్నాడు.ఒకటి మనస్తత్వాత్మక మైంది రెండు దర్శనాత్మకమైంది.(Psycologocal and Visionary)మనస్తత్వానికంటే మించిన సామూహిక చేతన ఒకటి మనిషిలో ఉంటుందని యూంగ్ నమ్మాడు. ఆధునిక కాలంలో ఫ్రాయిడ్ అతని అనుయాయులువేసిన మార్గాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కొత్తమార్గాలనన్వేషించాయి,ఆవిష్కరించాయి.రేణుకా అయోల కవితలో సాహిత్యతత్వమూ,మనస్తత్వమూ రెండూ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.వేరొక ప్రదేశంలో ఉండి అక్కడి ప్రకృతిని చూసి తన దేశపు ,ప్రాంతపు ఉనికిని కవితలో రికార్డ్ చేయటం ఇందులో కనిపిస్తుంది. "ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది " ఈవాక్యాన్ని చూస్తే ఇందులో ఙ్ఞాపకం రూపంలో తనను వెంటాడుతున్నదేదో అర్థమవుతుంది.ఫ్రాయిడ్ "ప్రాక్ చేతనా"న్ని గురించి చెబుతున్నప్పుడు ఙ్ఞాపకాలను గురించి చెప్పాడు.ప్రాక్చేతనలోని అంశాలు దమనానికి లోనుకావు కాబట్టి అవి గుర్తుకు వచ్చే అంశాలు సంఘటనలు తారస పడినప్పుడు అవి చుట్టుముడుతాయి.ఫ్రాయిడ్ దీన్ని సంసర్గ విధానం(Associative Process)అన్నాడు.సన్నిహితంగా ఉండే రెండు అంసాలలో ఒకటి కనిపిస్తే మరొకటి గుర్తుకు రావటం.దమన శక్తులుగనక ప్రభావం చూపిస్తే అంశాలు స్వప్నాలుగా ప్రవేశిస్తాయి. ఎర్రటి గులాబీలు,పల్చటిగాలి ,మట్టినిగుర్తుకు తేవడం ఇలాంటిదే.ఇలాంటి చేతన గురించి "మాండూక్యోపనిషత్తు" కొంత చెప్పింది. "జాగరితస్థానొ బహిష్ప్రఙ్ఞ:"-ఇది జాగరితమై బహి: అంటే దేశ కాలస్పృహతో ఉంటుంది..ఇందులో కనిపించేది ఇదే...ఈ అంసాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేసే అంశాలు కవితలో ఉన్నాయి. "మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం నాదేశంలోకి తీసుకు వెళుతుంది కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి ద్వారాలు వేరవుతున్న చప్పుడు అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు" ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయి."ద్వారాలు వేరవటం""ప్రాణాలు తీసుకున్న చప్పుడు"-ఇలాంటివన్నీ ఆతరహా కాలిక స్పృహ కలిగిన అంశాలే. ప్రతీవారిలో ఒకస్థిరమైన మానసిక వాతావరణం ఉంటుంది.అయోలాగారిలోనూ ఉంది.ఇది కొన్ని పద బంధాలద్వారా వ్యక్తమౌతుంది. ఆకుపచ్చని గడ్డి అలలపై/ఆకుపచ్చని నిశ్బబ్ధం / ఆకుపచ్చని నీడ/ఆకుపచ్చని లోయ/ పచ్చదనం ఆకులు /ఈ పదాలు ఆ బౌద్ధిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.-ఒక శుభకరమైన ఆశంసని కోరుతూ ఈ కవిత ముగుస్తుంది. ఇవి కూడా ఫ్రాయిడ్ చెప్పిన మనోనూర్తిమత్వ నిర్మితి(Anotamy of mental Personality)సంబంధించినవే..మంచికవిత అందించినందుకు అయోలా గారికి ధన్యవాదాలు.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uSwSJz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి