పేజీలు

23, మే 2014, శుక్రవారం

Pratapreddy Kasula కవిత

మాటలు - కాసుల ప్రతాపరెడ్డి మాట్లాడాల్సినవేవీ మాట్లాడకూడదు అసలు మాటలు లోన తెట్టె పెడుతూ ఉంటయి ఎజెండాలు వేరై, పలుకులు పాడైపోతుంటయి చిలుకా పలుకువే, నెమలీ ఆడవె అంతా రహస్యమే, ఏదీ బట్టబయలు కాదు అనుకుంటాం గానీ మనుషులు బయట పడరు మాటలు రహస్య యుద్ధసామగ్రి ఎదుటివాడిని గెలిచేందుకే వాడుతుంటం అప్పుడప్పుడు భుజం మీద చేయి వేసి మరి కొన్నిసార్లు చేతిలో చేయేసి మాటల ముల్లె విప్పుతుంటవు నీ శరీరం నిటారుగానే నిలబడుతది ఆత్మ లోలోన వంకర్లు తిరుగుతుంటది మనసునూ మాటలనూ వేరు చేసుకోలేనివాడు కాలం పుటల మీద కన్నీటి నెత్తుర్లు ఓడుతడు అయ్యా, ఆర్యా! ఓ నా మిత్రమా!! కొండ మీది కోతిని పట్టేవాడా! నమ్మకం మీద వేటు వేసినవాడా!! విశ్వాసం బలహీనత కాదు మనిషి కోసం దేవులాటలో ఒక పనిముట్టు బాతు బంగారు గుడ్డు పెట్టదు డబ్బులకు హృదయం ఉండదు ఒక్కో నోటు మరో నోటును కంటది మాటల మాయా మాంత్రికుడా! పెదవుల వంకర్లు నీ అందం కాదు ద్రోణాచార్యుడు నేర్పని యుద్ధవిద్య పిట్టను జోకొట్టి నిద్రపుచ్చుకో! నెత్తురోడడం నాకు కొత్త కాదు ఏదీ మొదలు కాదు, ఏదీ అంతం కాదు దేహాల మీద మరకలుండడం తప్పేమీ కాదు మనసులకు చురకలంటడం అబద్ధం కాదు నింగి మీదా నేల మీదా నేనొక్కడ్నే నగరం చేరినా నాగరికత అంటనివాడ్ని నేనేమిటో తెలిశాక నీ పిట్ట లేస్తూ వుంటది నీకొక్కటే భయం పాదాల నుంచి నెత్తి దాకా పాకుతుంటది బీరిపోయి, భీతిల్లి నా మీద బురద చల్లుతవు అయ్యా, నాయనా, నా ముద్దు స్నేహితుడా!! ప్రతి రాత్రీ తల్లి పాలు తాగుతున్నవాడ్ని తల్లి గర్భంలోకి చొరబడి తిరిగి జన్మిస్తున్నవాడ్ని నీవేవీ నాకంటవు గాక అంటవు

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocWmRn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి