పేజీలు

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నా చెలి! || దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ తలుపులు మూసివేస్తున్న భావనే కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది నా భుజస్కందాలే నాకు దూరమై .... నా మనోగతం చీకటి అయోమయమై కాలం భారంగా కదులుతున్నట్లు గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది. నీవు పక్కనున్నప్పటి నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు నా మది తెరపై జ్ఞాపకాలై అస్పష్టంగా .... పదే పదే కదులుతూ నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ తెలియని అలజడి, నా నరనరాల్లో పెరిగి ముచ్చెమటలు పడుతుంటాయి. గదిలోని ప్రతి వస్తువు మౌనంగా నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది. తీయని సెంట్ వాసన .... ఏదో బెడ్ రూం లో వరదలై పారి తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు బెడ్ రూం నేలపై పరుచుకునున్న నీవు విడిచిన ఆ దుస్తులు వెదజల్లుతున్న నీ స్వేద మత్తు వాసనలు పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి నా గుండె అల్లల్లాడుతుంది. అకస్మాత్తుగా నా మనస్సు ఖాళీ అయిపోయి నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు నా సర్వమై అమూల్యమైన లక్షణం నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో నన్ను ప్రశ్నిస్తుంటుంది. నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని? నా ఆత్మ సమర్పణ నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని. నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో నీ కళ్ళలోనే కనిపిస్తుంది నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు మదిని ఊరిస్తూ స్వర్గం ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు నా పక్కన ఉన్నప్పుడు నీ నవ్వు నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ, జంట నక్ష త్రాల్లా ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ ఏ ప్రత్యామ్నాయమూ లేని దివినుంచి దిగివచ్చి .... భువిలో నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా పొందాల్సిన సందర్శనీయ బహుమానం నీ అనురాగం అనిపిస్తుంది. నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా సంపూర్ణంగా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఆ బ్రహ్మ ఎంతో కష్ట పడి అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని నా అంతరాంతరాల్లో తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని అంకితమిస్తున్నాను. నా అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో తగిలే నీ వెచ్చని శ్వాస కోసం .... నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం .... శారీరకంగా, మానసికంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని జీవన చరమ ఘట్టం .... స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని మాటిస్తున్నాను. నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని 30MAR14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXmq4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి