పేజీలు

18, మార్చి 2014, మంగళవారం

బాలసుధాకర్ మౌళి కవిత

Restrogression ? అప్పుడే పుట్టిన లేగదూడ చర్మం మెరుపులాంటి వర్షాకాలపు పొద్దుటిపూట - చెరువు మీద వేటకు దిగుతాడు రెండేళ్ల బుడతడు వర్షాకాలపు పొద్దుటిపూట చెరువు - తనలాగే పసిది తల్లి వొడిలోంచి అప్పుడే నిద్రలేచిన నిద్రకళ్ల పసిముఖంది మెరకల్లో గేదెల మీద గుర్రపు స్వారీ చేసిన అనుభవమున్న ఆ రెండేళ్ల బుడతడు చెరువు మీదికి ఆశ్చర్యానందాల చూపులరివ్వ విసురుతాడు బుడతడి కళ్లల్లో గుప్పెడు బంగారు రంగు పరిగెలు ఈదులాడ్డం చూస్తాం వొక తడి స్వప్నం ముగ్ధంగా కదలాడ్డం చూస్తాం బుడతడు నక్షత్రకాంతిధారుడు గొప్ప సాహస యాత్రికుడు సౌందర్య ఉపాసకుడు ఆ బుడతడెవరంటే.. నలభైయేళ్ల కిందట వాగులో జింకలా పల్టీలు కొట్టిన నువ్వే గావొచ్చు లేదూ ఇరవైయేళ్ల కిందట మెరకల్లో మట్టిని ముఖం నిండా నలుగులా పూసుకున్న నేనే గావొచ్చు బాల్యం అద్భుత కళాఖండం శిలాక్షరాలపారవశ్యగీతం Restrogression అంతా తలకిందులయ్యింది వర్షాకాలపు పొద్దుటిపూట అప్పుడే పుట్టిందైనా - చెరువు క్రూరమైన మృగంలా కనిపిస్తుంది ఇష్టందీరా తిరిగిన పచ్చని మెరకలన్నీ లోపలకు మింగేసే మహా అగాథాలనోళ్లలా కనిపిస్తాయి కాళ్ల పాదాల దగ్గరే ఏ దుర్గమారణ్యం నుంచోతప్పిపోయొచ్చిన కుందేటి పిల్ల భయంతో మునగడదీసుకుంటుంది మమకారపు చే స్పర్శని కాసింత యివ్వనైనా యివ్వం కళ్ల ముందే రెక్కలు విప్పుకుంటూ రంగురంగుల పిట్ట సుదూరాకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది చూపుని కాస్తా అటువైపు తిప్పనైనా తిప్పం fearness భయం డ్రాకులా మనిషిని బంధీ చేస్తుంది సకల సౌందర్యానుభవాలనూ మనవి కాకుండా చేస్తుంది ఈసారి వర్షాకాలం వొచ్చినప్పుడు ఏ భయాందోళనలూ లేని రెండేళ్ల విలుకాడు - బుడతడుగానే మారదాం కళ్లను కోమల మార్దవ జలతటాకాలను చేసుకుందాం అంతా ఇక బాగుంటుంది ! 18.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cVaZV3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి