పేజీలు

28, జనవరి 2013, సోమవారం

" కవిసంగమం" కవితాపఠనవత్సరం - Nanda Kishore




Nanda Kishore
అందరికీ నమస్తే.

లామకాన్ వేదికగా మొదలయిన మన " కవిసంగమం" కవితాపఠనవత్సరం ఏ కొంచెం తడబాటులేకుండా తన మొదటి అడుగు వేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం!ముందుగా,ఊహించినదానికంటె ఎక్కువ సంఖ్యలో వచ్చి మా వేడుకలో ఆనందం నింపిన సహృదయ పాఠకమిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

వివరాల్లోకి వెళ్తే..

ఆహ్లాదకరమైన వాతావరణంలో, అప్పటికే అందరూ పలకరింపుల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ..దిగంబరకవిత్వానికి ఆద్యుడు ప్రముఖ కవి నగ్నముని,మరో ప్రముఖ కవి వసీరాతోపాటు వసీరాతోపాటు మన యువకవిత్రయం కిరణ్,మెర్సీ,ప్రవీణ్ వేదికనలంకరించగా-
captain యాకూబ్ ప్రారంభోపాన్యాసంతో సాయంత్రం ఆరున్నరగంటలకి మొదలైంది మా programme..

ముందుగా యాకూబ్ సర్ మాట్లాడ్తూ " కవిత్వం కావాలి కవిత్వం" ," కవిత్వం కావాలి కేవలం కవిత్వం" అంటూ కవిసంగమం దిశ,దశని ఒక్కమాటలో చెప్పివెళ్ళారు.లామకాన్ వేదికగా ఈ సంవత్సరమంతా ప్రతీ నెలా రెండో శనివారం ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తూనే,ఒక్క ఈ సంవత్సరమే కాదు ఓ నిరంతర వాహినిగా ప్రతియేడు ఈ సంప్రదాయం ప్రవహించాలన్న ఆకాంక్షను,కవిసంగమంతోనె అది సాధ్యమనే నమ్మకాన్ని వెలిబుచ్చారు.త్వరలో ప్రారంభం కానున్న కవిసంగమం e పత్రిక గురించి,International poetry dayకల్ల, కవిసంగమం ప్రచురణగా తీసుకురాబోతున్న కవితాసంకలనంగురించి,ఈ యేడాది చివరికల్లా అచ్చులోకి తీసుకురాబోయే bilingual anthologyగురించి అధికారికంగా ప్రకటన చేసారు.

విశేష అతిధిగా వచ్చిన నగ్నమునిగారి ప్రసంగం ఆద్యంతం రసవత్తరంగా సాగింది.కవిత్వం రాయడం మానేసి కూర్చున్న తనని," మీరు తప్పకుండా రావాలని,మార్గదర్శిగా ఉండాలనీ", పట్టుబట్టి తీసుకొచ్చిన యాకూబ్ సర్‌కి కృతజ్ఞతలు చెప్పి "కొయ్యగుర్రం నడవట్లేదుగాని,కొయ్యగుర్రం పుస్తకం ఇంకా నడుస్తోంది" అంటూ చెప్పకనే తనేంటో చెప్పుకున్నారు.దిగంబరకవిత్వమైనా,స్త్రీవాద కవిత్వమైనా,ఉద్యమకవిత్వమైనా తెలుగునాట వచ్చినంత సాంద్రంగా మరేభాషలో రాలేదని,తెలుగు కవిత్వం ఉద్యమాల మాళికనీ..అయితే తెలుగులో కనీసం చేతివేళ్ళసంఖ్యలోకూడా సాహితీ పత్రికలులేవనీ," మొదట మాట్లాడ్తూ చివర నిలుచున్నవాళ్ళం మనమని" విచారం వ్యక్తంచేసారు.1956 కాలంలో ఆధునిక కవిత్వం గురించి చెప్తూ అబ్బూరి వరద రాజేశ్వరరావుని,తాను కవులను పాఠకలోకానికి పరిచయం ఎంత బాధ్యతగా భావించింది తలుచుకుంటూ అజంతాను గుర్తుచేసారు.కవిత్వం తరతరాల జలపాతమని అభివర్ణించుకుంటూ ఒకతరానికి మరోతరానికి వారధిని కడ్తున్న కవిసంగమాన్ని అభినందించారు.టాక్సీ,జైల్లో సముద్రం,సైగల్,కర్త కర్మ క్రియ ...ఇంకా కొన్ని మధురమైన కవితల్ని గానం చేస్తూ తన గొంతులోని సైగల్‌ని కళ్ళముందు ఒలికించి నిశ్శబ్ధంగా కిందికి దిగారు నగ్నముని.

తర్వాత- "Because once it is a river,it is always thirsty అంటూ " లోహనది" ని మననం చేసుకున్న వసీరా మొదటిమాటలు వినగానే సభనిండా చప్పట్లు మోగాయ్.వసీరా మాట్లాడ్తూ 89లో అచ్చేసిన లోహనది,94లో గ్లోబలైజేషన్ తొలిరోజుల్లో రాసిన మరోదశ తర్వాత తనలో ఏదో తెలియని నిశ్శబ్ధం ఆవరించిందని "కవి సంగమం" తనలో కవిని మళ్ళీ తట్టిలేపిందనీ అన్నారు.తన గంభీరమైన స్వరంతో లోహనది,గుడ్ మార్నింగ్...కవితల్తోపాటే,de humanisationమీద రాసిన మరో కవితని, "ప్రేమే కవిత్వం-కవిత్వమే ప్రేమ" అన్న తన సందేశాన్ని కూడా వినిపించివెళ్ళారు వసీరా!

" సింహం గర్జించాక,ఏనుగు ఘీంకరించాక వచ్చిన కుందేలు పిల్లని" అంటూ నవ్వులు పూయిస్తూ మొదలెట్టిన యువకవి మిత్రుడు కిరణ్ కూడా తనదైన శైలిలో రాసిన నీలిచిత్రం,రాక్ఆన్, కాసనోవా లాంటి కవితలని చదివి సభికులని ఆకట్టుకున్నాడు.వ్యవస్థలోని ఖాలీని నింపడానికి సాహిత్య సమరం అవసరమని,అదే కారణం తనతో కవితలు రాయిస్తోందని,సామాజిక రుగ్మతలపై స్పందించడంలో కవి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నది తన అభిప్రాయమని చెప్పీ,ఓ అందమైన చిర్నవ్వుతో వేదిక దిగాడు.

" ఈ వేదికమీద నిల్చోవాలంటె కాళ్ళు వణుకుతున్నాయ్" అంటూ ఉద్వేగంగా ప్రారంభించిన యువకవయిత్రి మెర్సీ ఒంటరితనం,ప్రశ్నల గది... లాంటి అందమైన భావగీతాల్ని తన మృదువైన స్వరంతో గానంచేసి వినిపించింది.ఈ మధ్య కాలంలో తనద్వారా పాఠకులకి బాగా పరిచయమైన ఫెంటో అనే ప్రక్రియగురించి వివరిస్తూ ఈ కాలంలో పుస్తకపఠనం తగ్గిపోయిందని,30 వాక్యాల కవితల్లో ఏవో రెండో,మూడో వాక్యాలో కవిత్వం మిగుల్తోందని,అలాంటి వాక్యాల్నే కుదించి రాసుకునేవి ఫెంటోలని చమత్కరించింది.సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయి,స్తోమత తనకి లేవని తనకి తెలిసిందల్లా ప్రేమించడమేనని,తను కవిత్వం రాయడానికి తన మతం అడ్డుకాబోదని కూడా తేల్చిచెప్పింది.

ఇక చివరగా వచ్చినా మరో యువకవి మిత్రుడు,వరంగల్ కుర్రోడు ప్రవీణ్- చిగురంతైనా నిరాసక్తతలేకు లేండా కవితాగానం చేసి,తన కవితలతో సమానంగా తన వాక్చాతుర్యంతోనూ ఆకట్టుకున్నాడు.నన్ను కవిని కాదన్నవాన్ని కంకరాళ్ళతో కొడతా అంటు నవ్వించిన ప్రవీణ్ " ఆమె ప్రతీక్షణం అస్తమిస్తూనే ఉంటుందంటు" తన ప్రేమనీ,హృదయం పగిలి ముక్కలవుతున్నా ఒక్క కన్నీటి చుక్కా బయటికి రాదంటు" తన తత్వాన్ని," కాంక్రీట్ పై చలిస్తున్నవాడు,తన హృదయాన్ని కాంక్రీట్ గా మార్చుకుంటుండు" అంటూ తన సమాజ స్పృహని చాటుకున్నాడు.

ముగింపుగా- నగ్నముని గారు యువకవి మిత్రులందరు ఎప్పట్నుండో రాస్తున్నవాళ్ళలాగా అనిపిస్తున్నారని ప్రశంసిస్తూ సమీక్షించగా.. మన vice captain కట్టా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి,e పత్రిక గురించి మరోసారి గుర్తుచేసి కవిసంగమం ప్రపాదించుకున్న ఆదర్శాలకి హామీ ఇస్తూ programme ని ముగించాడు.

సభికులందరిలో ఆనందం నింపి,దిగ్విజయంగా ముగిసిన ఈ కార్యక్రమం కవిసంగమం ప్రయాణంలో మరో మైలురాయిని చేర్చిందని భావిస్తూ..కవిసంగమాన్ని ఆదరిస్తున్న,ప్రోత్సహిస్తున్నా మిత్రులందరికీ వందనమర్పిస్తూ..capatainకి,మీకూశుభాకాంక్షలు తెలియజేసుకుంటూ..

ఇంతటితో సెలవు తీస్కుంటున్నా..జయహో కవిత్వం.జయహో KS!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి