పేజీలు

8, ఆగస్టు 2012, బుధవారం

జుగాష్ విలి || ఎవరి నిర్వచనాలు వారివి ||

ప్రేమే జీవితంగా బతికే వారెప్పటికీ ఓడిపోరు
మహా అయితే తరచుగా గాయపడుతుంటారు
బహు తక్కువగా సుఖపడుతుంటారు

వారికి జయాప జయాలు అనిమిత్తం
వారి లాభనష్టాల నిర్వచనంవేరు

ప్రేమను తప్ప
మిగతా అన్నిటినీ ప్రేమించేవాళ్ళు
మహా అయితే ఎక్కువగా సుఖపడుతుంటారు
బహు తక్కువగా ఆనందపడుతుంటారు
ఎప్పటికప్పుడు లాభనష్టాల పట్టిక తయారు చేస్తుంటారు
వీళ్ళ జయాపజయాల నిర్వచనం వేరు

ప్రేమను కొలవడానికి ప్రేమతప్ప
ఏవేవో కొలబద్దలన్నీ అనేకం వుంటాయి వీళ్ళదగ్గర
ప్రేమ లేదనీ, దొరకలేదనీ, అంతామోసమనీ
అన్నీ వేళలా నిందిస్తుంటారు...చింతిస్తుంటారు
కొందరిపట్ల, కొన్నిటిపట్ల
హృదయాలను
వాటర్ ప్రూఫ్ వాచీలల్లే చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే

ఆనందంలో కంటే
సౌకర్యంలోనే హాయిని పొందుతారు
ఓటమిని గెలుపుగా బతికేస్తుంటారు
వీళ్ళ సుఖసంతోషాల నిర్వచనమే వేరు ...వేరు...
*07-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి