కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి
ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి
వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expeerienser)గా
కవిత్వం చెబుతున్న వాళ్లలో ఈతరహా కవిత్వీకరణ కనిపిస్తుంది."నేను"అనేది
ఒకటి ఇందులో కనిపిస్తుంది.ఇందులోనూ సమాజం అంతర్గతంగా ప్రవహిస్తుంది.
సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తున్న ఒంటరితనాన్ని,బాధని కవిత్వీకరించారు.
"తీరని వంటరి తనం నాకు మాయని గాయాని చేసింది"- "ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై.. నా కాలిని మెలి వేశాయి !" "కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు రక్తం లా వెచ్చగా మసులుతోంది!!" "ఇది సమరమని తెలుసు... ఇది నా ఒంటరి సమరమని తెలుసు.".. "జయాపజయములు ఏమైనా వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "
ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని
చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక
తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక
వాక్యాలుగా అందించారు."గాయం/పాము/మెలివేయటం/కన్నీరు/రక్తం"ఇవన్నీ బాధని తరువాత వాక్యాలు తన నిర్ణయాన్ని,తెగువని చెబుతాయి.
"ఏకాంతంతో సహవాసం జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం సాగి వేగి కడతేరేది ఎప్పుడో! స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"
ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత
ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా
చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.
కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే
అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం,హృదయాన్ని
తట్టే వాక్యాల్ని చెప్పడం వీటివెనుక పదిలమైన సాధన,అధ్యయనం అవసరం.ఇలాంటి
సమయాలలో కొంతమంది కొన్ని గుర్తుల్ని అనుసరిస్తుంటారు.తొలి దశని గమనిస్తే
పదాలలో బలవంతపు ప్రాసని అనుభవించడం.ఒకటి రెండువాక్యాలు యూనిట్లతో
పూర్తిచేయటం లాంటివి.
సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న
పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని
మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.
(చెట్టు తను ఎండలో వుంటు ఆశ్రయించిన వారికి నీడనిస్తుంది.ఇతరుల కోసం ఫలాలను కూడా ఇస్తుంది.సత్పురుషుడిలా)
తెలుగులో మనకి"చెట్టుకవి"(ఇస్మాయిల్)ఉన్నారు.ఏ
కాలానికైనా చెట్టు గొప్ప వస్తువు.అలాంటి చెట్టు వస్తువుగా రాసిన కవిత
తిలక్ "చెట్టు".ఇందులో తిలక్ లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది.చెట్లను నరకడం
పట్ల స్పందించి,భవిష్యత్తుని ఊహిస్తున్నారు.అనేక అవసరాలకోసం చెట్లపై
జరుగుతున్న పనులని తిరస్కరిస్తున్నారు.
"నా తనువునంతా/తొలిచేస్తూ/తడియారని కొమ్మలపై మానవ త్రాచుల/గొడ్డలి వేట్లు ",
"నవ్వుతున్న/వెన్నెల పూలు నా ఒళ్ళంతా/తుంచేసేవారే ... కాని తుమ్మేదవాలనిచేవారేవరు ?"
చెట్టు తానుగా మట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుష కథనం.త్రిపురనేని గోపిచెంద్
"మాకూ ఉన్నాయి స్వగతాలు"లో ఇలాంటి శైలి కనిపిస్తుంది.అందులోనూ ఓ తుమ్మ
చెట్టు కథ ఉంది.మంచి భారమైన వాక్యాలున్నాయి.గొంతుకని సమర్థవంతంగా అవి
ప్రసారం చేస్తాయి.
"ఒడిలిన ఆకులకన్న/రాలిన పువ్వులకన్న బాదిస్తోంది నేను లేని నా భూమిని పరికిస్తే/కూకటి వేళ్ళతో పెకలించేసారు/నా నేస్తాలెందరినో"
రెండు స్థితుల సంఘర్షణని చూపారిక్కడ.రాలిన ఆకులు,తనులేని భూమి
ఈరెంటినించి తిలక్ వచనం సాగింది.సాధరణంగా కవిత్వంపై ప్రతిఫలనాలుంటాయి.తిలక్
కవితపై సామాజిక ,వైఙ్ఞానిక ప్రతిఫలనాలున్నాయి.చెట్టులేని వాతావరణాన్ని ,ఆయా క్రమాలని ఊహించి జాగృతులని చేస్తున్నారు.
"పొదిగిన గూళ్ళు అన్ని చెదిరిపోయాయి ఇక నాలో ఒదగలేక ఆకసం సైతం అలిగింది/నా నిష్క్రమణతో"
"మేఘం ఉరమనంటుంది నేను లేని ఈ ధాత్రిలో చినుకు కురవనంది చెంతకురానివసంతాన్ని/చూసి "
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు "శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహః"అనే
గ్రంథంలో ఓ కథలో వృక్షంలేని నగరాన్ని చిత్రించారు.అందులో "రావణ నగరి
లంకాయాం షడపి రుతవః "అంటూ రావణ నగరంలోని వృక్ష రక్షణ గూర్చి చెబుతారు.ఈ
క్రమంలో పరోక్షంగా తిలక్ ప్రపంచీకరణని తిరస్కరిస్తున్నట్టు
కనిపిస్తాడు.కాని వాక్య రూపంలో ఇది కనిపించదు.
కొత్తగా రాస్తున్న ప్పుడు కవిత్వాన్ని ఒక రూపంలోకి తెచ్చుకోవటం కూడా
అవసరం.వాక్యాలని యూనిట్లుగా రాస్తున్నప్పుడు.ఆవాక్యాల రూపం అవగాహనని
అడ్డుకోగూడదు.వాక్యాల సమగ్ర రూపమే కవిత సమగ్రతని నిలబెడుతుంది.పద బందాన్ని
"వరుస"లో రాయగూడదని కాదు కానీ దానివల్ల అర్థ సంబంధంగానో,వస్తు సంబంధంగానో
ఒక అవసరమో,ప్రత్యేకతో ఉండాలి.
వేరువేరుగా
వరుసలు,వాక్యాలు,యూనిట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థం, వ్యక్తీ కరణ
ప్రధానం.ఈ విభాగాలని ,వరుసలని రాస్తున్నప్పుడు శ్రద్ధ అవసరం.
మంచికవిత అందించినందుకు తిలక్ బొమ్మరాజు గారికి అభినందనలు.ఇంకా
సాధన,అధ్యయనంతో మరిన్ని మంచి కవితలకోసం తిలక్ తనను నిలబెట్టుకోడానికి
దగ్గరలో ఉన్నారు.
"వృక్షోరక్షతి రక్షితః"అనే కాదు"నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను" అని మనమంతా నమ్మితే చాలు.
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో
వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే
జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి
వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం
అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య
,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని
వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా
మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను." "దారం ఉనికి తెలియనంత వరకూ ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది." "రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్ ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి
ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect
neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని
చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే
ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు. నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను. చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా, నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్
మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి
చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు
పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా
ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం
ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి
నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం
కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు
ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.
"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన
మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల
దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు
చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.
డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యాత్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.
ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ
భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే
ప్రయత్నం కనిపిస్తుంది.
"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను. నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది . నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది . నేను ఎగురుతున్నాను ......."
మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.
"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది . మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది . ఇంకోసారి మేఘమవుతుంది . నేను హిమాలయమై నదుల రెక్కలతో పీఠ భూముల్లో ప్రవహిస్తాను "
ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.
"భూమ్మీద కావ్యాలు అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్, కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"
కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎగరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన రెక్కలివి.
"రెక్కకొక కొత్త కన్ను. రెక్క కింద మెదడు "
మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త
వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని
అపేక్షించి,ఆకర్షిస్తుంది.కన్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.
"కవిత్వం వ్యక్తికి కాదు , ప్రపంచ హంసకు పర్యాయపదం"
అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.
ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న
నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన
పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా
ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యోగాలకోసం పుట్టిపెరిగిన ఊరికి,కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ కాలనికి ఒకటి,రెండుతరాలనించి కనిపిస్తుంది.
ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న
సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో
తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి
రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/కుమారుని గొంతుకనించి కనిపించవు.వస్తుసందర్భం,దాని మూలవస్తువులో సారూప్యతలున్నప్పటికీ ఇది ఈకాలానికి సంబందించి కొత్తవస్తువే.
రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా
స్థలపరిమితి(Spase Limitetion)కాల పరిమితి(Time Limitetion)అని
విడదీయొచ్చు.ఆఖ్యానంలో సత్యానికి సంబంధించిన ఆకళింపు ఉంటుంది. ఈ ఆకళింపులో
స్వభావం ఉంటుంది.ఈ స్వభావమే రచన గొంతుని చూపుతుంది.ఈ పరిమితిని
స్వభావపరిమితి(Personal Limitetion)అంటారు.
శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ
గతంగా చూపిన శ్రద్ధకూడా శైలిని ప్రత్యేకించి చూపుతుంది.ప్రధానంగా
వస్తువుని ప్రసారం చేయడానికి వాడుకున్న ప్రశ్నా వాక్యల పద్దతి
రూపముఖంగాబాగా ఉపకరించింది.
"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను! 'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!! యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను 'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు 'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా? అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"
ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా
మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ
క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి
తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.
"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు దృక్కులు పరిచాయని తెలుసు వెను తిరిగి చూడలేను!"
"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు వర్షిస్తూనే ఉంటాయని తెలుసు! వెను తిరిగి చూడలేను!!"
"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం గూడొదిలిన పక్షుల రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."
ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి
వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో
వాక్యాలను నిర్మించారు.
చాలాసార్లు కొత్తతరం కవిత్వం
రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక
అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో
పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు
కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు
రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే
ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.
శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను. _____________ఎం. నారాయణ శర్మ