భావకవిత్వం,అనుభూతి కవిత్వంలో లక్షం ఆనందం అని చెప్పుకున్నాం.ఈ లక్షం ప్రయోజన వంతంగా ఉండాలని భావించిన కవితాశైలి మార్క్సిస్ట్ కవితారీతి(maarxist poetical tredition).నిజానికి ఇది కవితను చూచే రీతినించి పుట్టింది.చెప్పే అంశాన్ని కాకుండా చెప్పే పద్దతిని ఎక్కువగా పట్టించుకోలేదని తొలిదశలో విమర్శలున్నాయి
తరువాతికాలాల్లో వచ్చిన మార్క్సిస్ట్ సాహిత్యం ఈరెంటినీ అన్వేషించి కవిత్వానికి అవసరం మేరకు కళ కావాలని భావించింది.ఈక్రమంలోనే మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది.తెలుగులో డా.బి.సూర్య సాగర్ రచన"సాహిత్యం సౌందర్యం"ఈదశని స్థూలంగా పరిచయం చేసింది.
తెలుగులో ఈపద్ధతిని మాధ్యమంగా చేసుకుని విమర్శలో కొన్ని పదాలు కనిపిస్తాయి శ్రామిక వర్గ సంస్కృతి(Prelet cilt)-1917 నాటికి కమ్యూనిస్ట్ పార్టీలు ఈపదాన్ని తెచ్చాయి.పెట్టుబడీ దారీ ప్రభావాన్ని తిరస్కరించే విషయంలో ఈపదం ఉనికి కనిపిస్తింది.ఈ క్రమం లోనే ఉపయోగ్య కవిత్వం(Applied poetry)కనిపిస్తుంది.ఇదిశ్రామిక జీవన సమస్యలూ,రాజకీయ ,సామాజిక ,ఆర్థిక సమస్యలని గురించి రాసేకవిత.
బాల సుధాకర్ మౌళి కవిత "అతడు ఈదేశానికి వెన్నెముక"ఈ రకమైన సంస్కృతిని ప్రదర్శించింది.నిజానికి ఈకవితలో కావావలసినంత కళాత్మకత ఉంది.అంతే దృక్పథమూ కనిపిస్తుంది.అందుకు ఆధునికంగా కవితానిర్మాణంలో కనిపించే విభాగలుగా ఉండే శైలినొకదాన్ని ఎన్నుకున్నారు.
నాలుగు అంశాలలో మొదటిదాన్లో రైతు స్థితి 2లో స్వభావం3లొ పెట్టుబడిదారీ తిరస్కారం4లోపై లక్షణాలని సమీకృతం చేసారు.ఈ నిర్మాణం వెనుక కవి సాధన కనిపిస్తుంది.
ఇందులో కవి సృష్టించిన వాతవరణం ,అందులోని తీవ్రత,స్వరం అన్నిటిలోనూ తౌల్యత కనిపిస్తుంది.వాతావరణాన్ని చిత్రించ డానికి అనేకమైన భావ చిత్రాలు నిర్మించారు.
ఇలాంటి భావచిత్రాలలోనూ కొంత శ్రామిక సంస్కృతి తళుక్కు మంటుంది."చెమట బొమ్మలు""ఆకలి కడుపు"వంటివ అందుకు ఉదాహరణలు."సూదుల కిరణాలతో చెమట బొమ్మలు చెక్కడం""వసంతమై పూయడం"కళకు అద్దం పడుతాయి.అంతే తీవ్రత ఉన్న స్వరమూ కొన్ని వాక్యాలలో ఉంది.
"అతని 'చేను ఆడబిడ్డల'పై/గుంటనక్కై కన్నేస్తాడొకడు అతని 'పొలం ఇంటి'పై/ఒడ్డీ జెర్రెలనొదులుతాడొకడు అతన్ని అధైర్యం ఉరితాడుపైకి/అశాంతి చేతులతో నెడతాడొకడు"
ఈ వాక్యాలల్లో దృక్పథం కనిపిస్తుంది.రైతు ఆత్మ హత్యదాకా వాతావరణాన్ని తీసుకెళ్లి స్ఫూర్తి దాయకమైన ముగింపునిచ్చారు.
మంచి కవితనందించారు బాల సుధాకర్ మౌళి.తెలుగులో రైతుల గురించిన సాహిత్యం వచ్చింది.వానమామలై జగన్నాథాచార్యులు "రైతు రామాయణాన్ని" రాసారు.దీనిపై డా.డింగరి నరహరి ఆచార్య పరిశోధన కూడా వచ్చింది.రైతాంగ పోరాట పాటలూవచ్చాయి.వచన కవితకు సంబంధించి"దర్భశయనం శ్రీనివాసా చార్య" వంటివారు ఇలాంటి కవితలు రాసారు.భాషా సంబందంగా "వందన కారుడు"వంటి పదాలపై మౌళి గారు పునరాలోచన చేస్తేబాగుంటుందనిపిస్తుంది.మంచి కవిత అందించినందుకు బాల సుధాకర్ మౌళి గారికి అభినందనలు.
తెలుగులో వచ్చిన అనేక అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానంగా దళితకవిత గూర్చి మాట్లాడుకోవాల్సిందే.నిజానికి ఇలాకులం,వర్గం,ప్రాంతం,మత ప్రాతిపదికన వచ్చిన వాదాలు కవిత్వానికి సంబందించి వస్తువు, శైలిమొదలైన విషయాలలో కవిత్వ వైశాల్యాన్ని పెంచాయి.
తెలుగులో శివసాగర్ నుండి సతీశ్ చందర్,ఎండ్లూరి సుధాకర్ మొదలైన వారిదాకా దళితకవిత్వం వేసుకున్న మార్గాలు చాలా బలమైనవి.కృపాకర్ గారిలోనూ ఈ తాత్వికత బలంగా కనిపిస్తుంది.
ప్రధానంగా ఇందులో గమనించాల్సిన అంశాలు రెండున్నాయి.ప్రతీకలని ప్రత్యేకంగా కూర్చుకోవడం శివసాగర్ నుండేమొదలైనా ఆతరువాత కవులుకూడ ఈఆలంకారికాభివ్యక్తి(Figaretive expression)కొనసాగించారు..కేవలం ప్రతీకల స్థాయిలోనే గాకుండా వాక్య రచనకు కూడా పరికరాలని ప్రాంతీయపదజాలం(Preventialism)నుంచి కూడా కూర్చుకుంది.ప్రధానంగా తెలంగాణా ఉద్యమం కవిత్వానికి ఈ అదనపు సౌందర్యాన్ని తెచ్చింది.(గతంలోనే జానపదాల్లో ఉందనేదికూడా వినిపిస్తుంది)
"మా యవ్వనోద్రేకాలు సింగిడి వాగులై పొంగినపుడు కులంకట్టు గాట్లను తెంచుకోజూసిన కట్టుగొయ్యలం మీ చేతుల్లో పగిలిన చేతి గాజులం సేపు లొచ్చినా, పసిబిడ్డలకు పాలివ్వటానికి అనుమతి లేని తల్లి ఎదల ఎతలం "
పై వాక్యాల్లో ఆత్మ గౌరవ సంబంధమైన ఉద్వేగ స్థాయి,కొంత సామాజికమైన చారిత్రక అనుగమనం కనిపిస్తాయి.ఈ కవితనిండా ప్రతీకాత్మకంగా కనిపించే పదాలే బలమైన అభివ్యక్తిని పరిచయం చేస్తాయి.ప్రతీ వాక్యంలోనూ "పరిగె కంకులు,నెర్రెల్లో ఇరుక్కున్న మట్టి గింజలు,పాశేరు వొంచలు,"లాంటివి బలమైన వ్యక్తీకరణలు.
"ఆసాములు పంట కోసుకున్నాక మిగిలిన తాలూ తరగల పరిగె కంకులం "
"మనుషులుగా మర్యాదలు దక్కని కులవెరి లోకం లో నిండిన సల్ల కుండల్లా ఉండలేం నంగి దొంగ పెద్దరికాల మీద మండుతానే వుంటాం"
కృపాకర్ గారి వాక్యాల్లో కావల్సినంత వేగం ఉంది.పై వాక్యాల్లో తాను పలికించాలనుకున్న గొంతుకూడా సుస్పష్టంగా వినిపిస్తుంది.రూపాన్ని తయారు చేసే పరికరాల విషయంలోకూడ కొత్తదనాన్ని తనదైన దృష్టిని చూపుతున్నారు.కవితని వాక్యాలుగా,యూనిట్లు గా అందించటం వలన పాఠకులకు ఆకవితా హృదయం మరింత దగ్గరవుతుంది.మరిన్ని మంచికవితలతో బలమైన గొంతుకని వినిపిస్తారని ఆశిద్దాం.
వాక్యాల నిడివి,యూనిట్లుగా రాయడం ఇప్పుడు కవితని ఒక రాశిగా రాస్తున్న వారంతాగమనించాల్సిన అంశం.అందువల్ల చదవడాంకి సౌలభ్యం పెరుగుతుంది.మంచి కవిత అందించి ననుకు కృపాకర్ గారికి అభినందనలు.
భావకవిత్వానికి(romantic poetry)కి ఈవలి దశలో తెలుగులో అనుభూతి కవిత్వం (poem of feeling/pure poem)ఒకటి కనిపిస్తుంది.నిజానికి ఈరెంటిలోనూ వర్ణనే ప్రధానం.కాని వీటినిర్వహణలో వెంట్రుకవాసి అంతరం ఉంది.భావకవిత్వంలో సందేశం,ఆనందం రెండూ ఉంటాయి.అనుభూతిలో అనుభూతివల్ల కలిగే ఆనందమే ఉంటుంది.
వర్ణన విషయానికి వస్తే వస్తుగత వర్ణన(Conceptual discription)కళాత్మక వర్ణన (easthetic discription)అని రెండు భాగాలున్నాయి.చాలవరకు ప్రబంధకాలం నుండి కనిపించేది కళాత్మక వర్ణనే.కావ్యాల్లో ఇతిహాసాల్లో నదులు,వర్షం ,హిమాలయాలు వంటివి దొరికితే కవులు అద్భుతమైన వర్ణనలు చేసేవారు.
శ్రీనివాస్ గారు వర్షాన్ని అనేక భావచిత్రాల ద్వారా అందించారు.కావ్యాల్లో సంస్కృత భారతంలో వ్యాసుడు,తెలుగు భాగవతంలో పోతన,హరివంశంలో ఎర్రన..ఈకాలానికి వస్తే ఇస్మాయిల్ వర్షాన్ని గురించి అద్భుతమైన వర్ణనలు చేసారు.ఈ కవితలోనూ ఆసంప్రదాయాలు కనిపిస్తున్నాయి.
"చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు మేఘాల విల్లుతో. చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో మెరుపు నారి సారిస్తూ. చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం ఉరుమై తరుముతుంటే, నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో" చాల అందమైన ఊహలు చేసారు శ్రీనివాస్.ఉరుముని>ధనుష్టంకారమని ..చినుకుని>బాణమని..మెరుపు>నారి అని ఒక యుద్ద దశని చూపినట్టుగా వర్ణించారు.. కావ్యాలల్లోనూ "ఇంద్రుని"పేరే ఎక్కువ.దిక్పాలకులకు అధిపతి గనుక..ఈ వాక్యాల్లో ప్రాబంధిక సృజన కనిపిస్తుంది.
"తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది నీటితివాచీలను...చినుకు దారాలతో. చిందేస్తూ చినుకుల చిన్నది మేఘ తాళాలకి ధీటుగా."...చినుకుల్ని దారాలుగాచెప్పటం ఆధునిక దశ..బహుశః మొదట ఈ ప్రయోగాన్ని సాదించింది ఇస్మాయిల్ గారు."రేకు డబ్బాను పొట్లమని..చినుకుల్ని దారాలని"ఆయన రాసిన గుర్తు?-ఇక్కడ మేఘాల ఉరుములని తాళాలుగా చెప్పటమూ కనిపిస్తుంది.ఈ వాక్యంలో భాషకూడా ఆధునిక స్థాయికి వచ్చింది.ఈ కోణం లో పరిశీలించి చూస్తే శ్రీనివాస్ గారిలో పఠనానుభవ ప్రభావం కనిపిస్తుంది.
అడుగడుగునా శ్రీనివాస్ గారు చిత్రించిన భావ చిత్రాలు,కళాత్మక వాక్యాలు ఆహ్లాద పరుస్తాయి.
"ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో ఆ తుంటరి మేఘం."
" ఎక్కడ నేర్చిందో ఆ కొండ చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య."
ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి.శ్రీనివాస్ గారిలో మంచి ఊహా చాతుర్యం ,ప్రత్యేకించి ప్రకృతిని బాగా అనుభవించ గల అనుభూతి దారుఢ్యం కనిపిస్తుంది.ఈకాలంలో వచనం కొంత ముందుకు చేరింది.దాన్ని అర్థం చేసుకోడానికి ఆధునిక కవిత్వాన్ని ,భాషాశైలిని అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.అందువల్ల రెండురకాల భాషాశైలుల నుండి తనదైన దారివెదుక్కోగలుగుతారు.కాలానికి తగిన వస్తువు శ్రీనివాస్ గారు ..జయహో..
అస్తిత్వవాదులు అనాసక్త జీవితం(undesired life)గురించి మాట్లాడారు.సాహిత్యంలో సామాజికాస్తిత్వ ఛాయలు (sheds of social Existence)మాత్రమే ఎక్కువ.సాధారణంగానే వైయ్యక్తికాస్తిత్వ ప్రకటనలు తక్కువ.నిజానికి అస్తిత్వ వాదులు ప్రకటించే మృత్యువు దాకకూడా ప్రధానబలం ఇదే.
ఈ మధ్య ఫేస్ బుక్ లలోఅనాసక్త జీవితాన్ని గురించి కొన్ని హాస్య స్ఫోరకమైన ప్రకటనలు కనిపిస్తాయి.ఆది నుంచి శనివారం వరకు సెలవు పట్ల మనసుకు కలిగే భావనలు ఇందులో కనిపిస్తాయి.ఇలాంటివి చాలవరకు ఎక్కడో ఒక దగ్గర అందరూ పంచుకుంటున్నవే.నిజానికి ఈ అంశాలు ఆసక్తత,నిరాసక్తత సాధరణాంశాలే అనేది మనోవైఙ్ఞానికుల భావన.ఇవి సహజ ప్రకటనలనేది వారి అభిప్రాయం.
ఒక గంభీర స్వరంతోటి మోహన్ రుషి ఇలాంటి అంశాన్ని "సోమవార వ్రతమహాత్మ్యం"గా తీసుకొచ్చారు.ఓధీర్ఘ(నిజానికి ఒకరోజే అయినా) విరామ ఆహ్లాదాన్ననుభవించాక మళ్లీ క్రమజీవితం(Roteen life)లోకి తీసుకెళ్లేది సోమవారం.ఇలాంటి సందర్భంలో మనసు మొరాయిస్తుంది.
ఐచ్చికత,మానసిక భావన,యాంత్రికత,భౌతికత ఈ అంశాల ప్రభావం ఒకదాన్నుంచి ఒకదానిలోకి మారే క్రమంలో ఉంటుంది.ఐచ్ఛికత ప్రభావంచూపినపుడు ఉల్లాసం,భౌతికత ,యాంత్రికత ప్రభావం చూపినపుడు నిరాసక్తత కలుగుతాయి.నిజానికి ఒక్కోసారి వేదాంతంలా కూడా కనిపిస్తుంది.ఈ అంశాలని"వ్రతం"అనేపదం నుంచి నడపడమే ఇక్కడ కనిపించేది.ఈ పదాన్ని సంప్రదాయానికి లోబడి మానసిక ,ఐచ్ఛిక నిరాసక్తతలకు దూరంగా అనుసరించేది అనే అర్థంలో ఉపయోగిస్తారిక్కడ.
"పెద్దగా చెయ్యడానికేం ఉండకపోవచ్చు..కాని ఉండాలి అక్కడ మెకానికల్ గానో,మెకాలేకి లాయల్ గానో"
రెండు పదాలనించి మానసిక,యాంత్రిక గమనాల సంఘర్షణని వ్యక్తం చేస్తారు."మెకానికల్ గానో,మెకాలేకి లాయల్ గానో""పాపానికో,పుణ్యానికో"ఇలాంటి జంట పదాలు,పద బంధాలు అందుకు నిదర్శనం.
"చివరాఖరికి/మనల్ని మనం సాధించుకోవాడానికి వెన్యూమార్చి మార్చూరి రూంలాంటిహోంకి చేరుకుని/ముగించాలి"
ఈ కవితలో మంచి పరిశీలనా ఙ్ఞానం ఉంది..ఇందులో మానసిక ప్రతి ఫలనం గమనించాల్సిన అంశం.కావల్సిన మేరకు వాక్య నిర్మాణాన్ని సాధించడమూ ఇందులో కనిపిస్తుంది.మరిన్ని మంచి కవితలు మోహన్ రుషి నుంచి రావాలనికోరుకుందాం.. 13.8.2013
విమర్శలో సామాజిక వాస్తవికత(social reality)అనేఅంశాన్నొకదాన్ని చూస్తాం.సమాజంలోని అంశాలని గమనించిసృజన చేసినప్పుడు దాని సామాజిక వాస్తవికతగా చెబుతాం.ఈక్రమంలోనే సవిమర్శక వాస్తవికత(Critical reality)ఒకటి కనిపిస్తుంది.సమాజంలోని అన్యాయాలను,వ్యత్యాసాలను గుర్తించి వాటిని విశ్లేషిస్తూ రచనలు చేయడం.కేవలం సమస్యను చూడటంతోనే ముగించేసిందని విమర్శకుల నిందల్నిమోసినా ఈ అంశం అనేక సూక్ష్మాంశాలని వెలికితెచ్చింది.
అభ్యుదయ భావనని తీసుకొని వెలికి వచ్చిన అనేక వాదాలలో ఈవాస్తవ ప్రతిఫలనాలున్నాయి.ఏ సృజనకారుడైనా తానున్న కాలానికి సమాజానికి కట్టుబడకుంటే అతనిలోఈ వాస్తవాంశ ఆశించిన స్థాయిలో కనిపించదు.
సమాజంలోని ఒక అమానవీయ సంఘటనని,సందర్భాన్ని ఉద్వేగంగా వ్యక్తంచేసారు సాగర్.నిర్మాణపరంగా చూస్తేఇందులో రెండు అంశాలున్నాయి. కొంత సేపు ప్రథమ పురుష కథనం ,మరో భాగంలో ఉత్తమ పురుష కథనం ఈరెంటిలోనూ సారవంతమైన ఉద్వేగాన్ని పలికించారు.
"కోట్ల కణాల యుద్ధంలో గెలిచి చొరబడింది మాతృగర్భంలోకి రేపటి భవితకి పునాదిలా"--ఇది నిజానికి ఒక అనిర్దిష్ట వాక్యం కవి దేన్ని గురించి చెబుతున్నాడో తెలీకుండా పరోక్ష స్పృహ కలిగిస్తాడు.ఇలా ప్రాణం గర్భంలో చేరడందగ్గరనుంచి,అందులో నిలదొక్కుకోవడం దాకా కవిత సహజంగా సాగిపోతుంది.
"ప్రతిక్షణం పోరాటమే నీలో నిలబడటంకోసం"..ఈ వాక్యం నుంచే కవియొక్క దర్శనం కవితపై ప్రభావం చూపుతుంది..నిజానికి ఇక్కడ కవి స్వరం మారింది.పాత్ర లోకి లీనమై నాటకీయమైన (Drametic0వాక్యాల్ని ఇక్కడ నిర్మిస్తారు.
"వివక్ష నీ నరనరాననింపి /విత్తనంలా మొలవ బోతున్న నన్ను /విచ్చిత్తి చేస్తున్నావు"...సవిమర్శకవాస్తవికత భవిష్యత్తును దర్శిస్తుంది..ఈకవిత ఇలాంటి వాక్యాలతోనే ముగుస్తుంది..
"నీ గుడ్డి తప్పుకి మూల్యాన్ని చెల్లిస్తావు ఒక్కో నలుసుని నలు దిక్కులా వెదుకుతూ"
వర్తమాన సమాజాన్ని ఎక్కువగా పీడుస్తున్న అనేక సమస్యల్లో భ్రూణ హత్యలొకటి..ఈఅంశాన్ని సమాంతరానుభవాన్ని పొందేలా అందించారు పుష్యమీ సాగర్.ఇలాంటి కొత్త అంశాలని(ఈ అంశంపై కవితలు గతంలోవచ్చినప్పటికి..అవితక్కువే మిగత అంశాలతోపోలిస్తే)కవులందరూ లోకనికి అందిచాలని ఆశిద్దాం.మంచి కవిత అందించి నందుకు పుష్యమీ సాగర్ గారికి అభినందనలు.
abstraact అనే పదానికి సూక్ష్మీకరణ అనేఅర్థం ఉంది.నిజానికి సూక్ష్మీకరించినపుడు విషయం మొత్తం అవగాహనకు రాదు. ఒక సన్నివేశాన్నో,వాతావరణాన్నో తెలుపుతున్నపుడు ఆ సందర్భంలోని అంశాల సంభావ్యతలవల్ల చెప్పాలనుకున్నది చేరుతుంది.వాక్యాలు ఒక స్థాయిలో సూక్ష్మీకరింపబడి ఇతర వాక్యాలతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఒక వాతావరణాన్నో,సందర్భాన్నో చెబుతాయి.ఇది భాషా శాస్త్రంలోని "సంధాయక సంబంధం"(Cohesive link)లాంటిది.
భావచిత్రం-అనేపదం ఒకటి వినిపిస్తూ ఉంటుంది.సంపూర్తిగ అ ఒక దృశ్యాన్ని వర్ణిస్తే,చిత్రిస్తే అది భావచిత్రం(Imege).కొన్ని అంశాలు వాతావరణాన్ని దృశ్యాన్ని స్ఫురించేటట్టు చేస్తే అది నైరూప్యతకు దగ్గరగా ఉంటుంది.అయితే ఇందులో స్ఫురణకు దోహద పడనివి,సామాన్య దృష్టికి కూడా కనపడనివి ఉంటాయి.
డా.ప్రతాప్ కత్తిమండ "మరణ శయ్య"-కవిత "ఎయిడ్స్"వంటి వైరస్ లకు సంబందించి ప్రేరణాత్మకమైన వాక్యాలని అందించింది.నాలుగు భాగాలుగా కనిపించే ఈకవితలో మొదటి దానిలో విషయాన్ని ప్రతిపాదిస్తారు.రెండవ దాంట్లో కారణాన్ని వివరిస్తూ హెచ్చరిస్తారు.మూడవదాంట్లో పైన చెప్పుకున్న ఒక సూక్ష్మీకరింప బడ్డ చిత్రం కనిపిస్తుంది.
"పరిమళాల మంచంపై సరసాల షోకులతో/పొంగి దొర్లిన నాకు అదే మంచం/మరణశయ్య గా మారింది"
"మత్తెక్కించే అందం/పక్కకు లాగితే మతి చెదిరిన నేను/గతి లేకుండా పోయాను "
ఈరెండు వాక్యాలు కవి చెప్పాలనుకున్న వాతావరణం లోనికి తీసుకెళతాయి.మూడవ భాగంలో వాక్యాన్ని పదబంధంగా సూక్ష్మీకరించడం కనిపిస్తుంది.
"జాజుల సువాసనలు/గాజుల గల గలలు అత్తరు పరిమళాల/అక్రమ సంబంధాలు చిత్తడి జీవితాలు/చిత్తయ్యే బతుకులు "
ఈ ఆరు పద బంధాలు అర్థపరంగా వాక్యాలంత నిడివి కలిగినవి.ఇందులో వాక్య నిర్మాణ పద్దతిలో చూస్తే కేవలం క్రియలని మాత్రమే ఉప సం హరించారు.ఇవి సామాన్య వ్యవహారంలోనివే. రెందు ప్రేరకాంశాలు,కారణం,పరిణామం వీటిని ఈ అంశాలు వెల్లడిస్తాయి.చివరి భాగంలో పర్యవసానాన్ని చెప్పి ముగిస్తారు.చిన్న కవితే అయిన నిర్మాణ వ్యూహం ఇందులో కనిపిస్తుంది.వస్తువు కూడ మానవ స్వభావాలని పరోక్షంగా చెప్పేదే.మంచికవిత అందించి నందుకు ప్రతాప్ గారికి అభినందనలు.
ప్రతీ ఆటకీ,శాస్త్రానికీ,అంశానికి కొంత పరిభాష ఉంటుంది.ఇది అనేక కోణాలలో ఆప్రాంతంలో,వ్యక్తుల మధ్య వాడుకలో ఉంటుంది.ఆవ్యక్తులు,ప్రాంతాలు పరిసరాలు సంస్కృతి సంప్రదాయాలతో సంబంధంలేనివారికి ఈ పదజాలం దూరంగా ఉండవచ్చు.జలియ క్రిస్టీనాచెప్పిన అంతర్గతవచనం(Inter textuality)ఇలాంటిదే.
అన్నవరందేవేందర్ తెలంగాణాలో పల్లెప్రజలలో ఎక్కువగా అలవాటులో ఉన్న "పచ్చీస్"ఆటకు సంబంధించిన పరిభాషతో ఉద్యమ సందర్భాన్ని స్ఫురింపజేస్తూ రాసినకవిత"గుడ్డీస్".ఇందులోపచ్చీస్ ఆటలోని ఎత్తులు,పయ్యెత్తుల గురించి చెబుతున్నట్టుగా ఉంటుంది కానీ దాన్నానుకొని తను చెప్పాలనుకొన్న అంశాన్ని చెప్పడం ఇందులో కనిపిస్తుంది.
ఈదశాబ్దంలో తెలంగాణాఉద్యమం,దళిత బహుజన వాదాలు ప్రజావ్యవహారంలోని జీవద్భాషకు సాహిత్యంలో ఉనికిని తెచ్చాయి. ఆయా జీవితాలు,సంస్కారం,సంప్రదాయాలు కవిత్వంలో అనేక మార్గాలలో ప్రతిఫలించాయి.
"గడల మీద కూకున్నా/గడ్డ మీద నిలబడ్డా గండం తప్పది " మొదటి వాక్యంలో ఆట నడకని,రెండవవాక్యంలో ఉద్యమ సందర్భాన్ని నడుపటం ఇందులో కనిపిస్తుంది.ఇలంటిదాన్ని అనువర్తనగమనం అన్నారు.పై యూనిట్లలో రెండవ భాగంలో మూడు అంశాలున్నాయి.మొదటిది ఒక సందర్భాన్ని రెండవది మరో సందర్భాన్ని మూడవది ఈరెంటికీ సమన్వయమయ్యేలా ప్రవర్తిస్తుంది.
ఇందులో కొంత పరిభాషకూడ గమనించదగ్గది,పచ్చీస్>ఐదు గవ్వలు వెల్కల పడటం,తీస్>ఆరువెలకల పడటం,(ఇందులో మొత్తం గవ్వలు 7.ఒక్కో దానికి 5 పాయింట్లు లెక్కిస్తారు)దస్>ఒకటి వెల్కల పడటం.దూగ తీని,చారి లాంతివి అలాంటివే .ఇవన్నీ పందాలు.ఈ క్రమంలోనూ ఉద్యమంలోనిధర్మంపట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు.
"గవ్వలు ధర్మం చెడలే/గౌరాంతం గడ దించుతాయి సంకలమంటి సంబురమైనా/దూగ తీని చారీలే" "పోరాట నేలలో పచ్చీస్ ఆటలో/నిన్ను ఓడ కొట్టేందుకు సంపుడు పంజం పుట్టింది/పానషరం పట్టి అయినా గెలుస్తా" గౌరాంతం,సంబురం,పానషరం లాంటి పదాలు తెలంగాణా భాషాసౌందర్యాన్ని చెబుతాయి.రెంటి మధ్య కవితలో అన్నవరం సాధించిన సమన్వయం గొప్పగా ఆకట్టుకొంటుంది.
జీవితం కొన్ని అడుగులువేసాక,కొంత కాలం గడిచిపోయాక గతానికి,వర్తమనానికీ మధ్య సంఘర్షణ ఒకటి ఉంటుంది.ఇది కాలాల సందర్భంగా వాటిని పునశ్చరణచేస్తుంది.పునశ్చరణ(Anamnesis)అనే పదాన్ని వ్యక్తులు,సందర్భాలు,స్థలాలు మొదలైన వాటిని ఆయా సందర్భాలనుంచి గుర్తుచేసుకునే క్రమంలో ఉపయోగిస్తారు.
నందకిషోర్ ఇలాంటి సందర్భాన్నించే గతాన్ని,అందులోనుంచి వ్యక్తుల్ని పునస్సృష్టిస్తున్నారు.ఇవి సంప్రదాయంలోని,ఆధునిక జీవితానికి సంబంధించి అనేక సంఘర్షణలని వెలిగక్కుతుంది.ఈ కవితలొ తెలంగాణా ప్రాంతీయ పద జాలం(Preventialism)ఒక ప్రత్యేక ఆకర్షణ.ఈ దశాబ్దికి ఈవలి భాగంలో కవిత్వంలో తెలంగాణా నుడికారాన్ని ఎక్కువగా ఉపయోగించారు.ఒక క్రమంలో ఈ దశాబ్దిని తెలంగణా ఉద్యమం సాహితీ ముఖంగా ప్రభావితం చేసింది.
ఇందులోది"రాఖీ"పండగకు సంబంధించిన ఇతివృత్తం.కాని ఇందులో స్వరం తానుద్దేశిస్తున్న రెండు పాత్రల ప్రేమాభిమానాలకు సంబంధించింది.
"నేనొచ్చి లోపలికి తీస్కపోవాలని కడపకాన్నే కూలబడ్డట్టు.. నీ కండ్లపొంట నీళ్ళు బొటబొటా రాలుతున్నట్టు."
"బట్టలుతుక్కొని ఎర్రగైన లేత చేతుల్లల్ల కట్టెల్లసంచితో నువ్వింకా అక్కన్నే నిలుసున్నట్టు.. గనపడంగనే ఉరుక్కుంట వచ్చి కావలించుకుని కండ్లు తుడుసుకున్నట్టు.." ఇక్కడ సందర్భంలోని స్థితిని,అందులోని వ్యక్తి స్థితిని చెప్పడం కనిపిస్తుంది.అనుబంధాలు పెనవేసుకున్న అనేకసందర్భాలని చెప్పడానికి విశదీకరణ(Elaboretion)అనే నిర్మాణ సూత్రాన్ని ఒకదాన్ని ఇందులో ఉపయోగించారు.పండుగ సందర్భాన్నించి జీవితాన్ని స్పర్శించే ప్రయత్నం కనిపిస్తుంది.నిజానికి సంభాషణ శైలీ ఈనాటకీయ లక్షణాన్ని చెబుతుంది.
"సాగతోల్తాంటే అమ్మ నా చేతిల నీ చెయ్యిపెట్టినప్పుడో నల్ల పూసలు గుచ్చినంక కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో నిమిషమన్నా దుక్కించకపోతిని!"
ఈవాక్యాలు తను సందర్భాన్నించి దేన్ని అనుభవిస్తునాడు అనేది స్పష్టమవుతుంది.కవిత రచనలోని స్వరాన్నించి తాననుభవిస్తున్న అంశాలు తెలుస్తాయి.అర్థ దిశలో స్వరం కవిత్వంలో తెచ్చే విస్తృతజీవితాన్ని గురించి ఐ.ఏ.రీచర్డ్స్ ప్రస్తావించారు.ఇందులో ఆసంప్రదాయంకొనసాగింది.
తెలంగణాజీవద్భాషలో సాధరణంగానే ఉద్వేగమైన,సాంద్రమైన లక్షణాలున్నాయి ఈఅంశాలని నందకిశోర్ బాగాఉపయోగించుకున్నరు.మంచి కవితని ఓ ప్రత్యేక సందర్భంలో అందించినందుకు నంద కిషోర్ కు అభినందనలు.--
చాలా కాలం క్రితం ఓ మిత్రుడు"ఫలానా కవిత-మానవీయత"అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్నానన్నాడు.వెంటనే ఇంకో మిత్రుడు"కవితలో మానవీయతని ప్రత్యేకంగా వెదకాలా?అది లేకపోతే కవిఎలా అవుతాడు?"అన్నాడు.రామాయణంలోని"మానిషాద"శ్లోకం నించి ఇప్పటివరకు ఈధార ఇలా సాగాల్సిందే.
వచ్చిన ఏవాదకవిత్వపు కొత్తదనాన్ని గురించో అధ్యయనం చేస్తుంటాం గాని.దాని సారాంశాన్ని పట్టించుకోం.గత పదేళ్లుగా పోరాడుతున్నప్పుడు(ఆరుపదులైనప్పటికీ)రెండు వైపులా భావోద్వేగాలు(ప్రజల్లో)ఎక్కువైనపుడు సంభాషణలు సాంత్వన నిస్తాయి.తెలంగాణా ఉద్యమం ఇలాంటి జీవనాస్తిత్వాలను సారవంతం చేసింది.వేనేపల్లి పాండురంగా రావు "కావడి కుండలు"తీసుకు వచ్చారు.ఆమధ్య తెరవేకవిసమ్మేళనం ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి.
కోడూరి విజయ్ కుమార్ గారి కవిత"ఒక సంభాషణ కోసం" ఇలాంటిపనికే పూనుకుంది.తానుగా చెప్పుకున్నట్టు (నాకు అర్థమయినంతలో కూడా)ఆయన లో బయటి కల్లోలమే ఎక్కువ.ఈ కల్లోలాన్నించే వర్తమాన పరిస్తితులనుంచి ఓ సారవంత మైన స్నేహాన్ని అన్వేషిస్తున్నారు.
"ఒక సందేహమేదో ఇంకా తొలిచి వేస్తోంది నీ వేదననీ కాస్త అక్కున చేర్చుకోవాలని వుంది"
"ఇప్పుడు కూడా నా నేల కన్న కలని ఒక మాంత్రికుడు పన్నిన వలగానే చూస్తున్నావు'
కోడూరి కవితకు తానే మార్గంలో నడవాలోతెలుసు.ఓ ప్రాంతీయ కవితకుండాల్సిన ధారుడ్యం ఆతాలూకు స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది.తెలంగాణా అడుగడుగునా తనను కోల్పోయిన అంశాన్ని చెబుతారు.ఇందులో కనిపించే వచనం సారవంతమైన సంఘర్షణని వ్యక్తం చేస్తుంది.
"మా మాతృభాష ఒక అనాధ" "అది వెండితెర హాస్యపు సరుకైనపుడే ఎర్రబడిన మా ముఖాలని చూడవలసింది' "ఈ నేల మరొక పోరాటానికి సిద్ధమయ్యాక కూడా ఇదొక సాధ్యం కాని స్వప్నం అనే నిర్దారించావు "
విజయ్ సమాజపులోతుల్ని,దానికుండే చరిత్రని తెలిసిన కవి.గతంలోనూ ఒకటి రెండు కవితలు రాసారు."అనంతరం"లో ఉన్న 'కొంత కాలంతరువాత కొన్ని ప్రశ్నలు" కవిత ఇలాంటి దృష్టినే ప్రసారం చేస్తుంది.పల్లెలు నగరాల్లో కలసిపోయిన ఉదంతాన్ని కూడా చాలాకవితలు ఉదహరించాయి.గతంలో ప్రత్యెకంగా పల్లెల గురించి రాయకున్నా"గ్లోబల్ సాంగ్"(అక్వేరియంలో బంగారుచేప)లాంటి కవిత రాసిన విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించటం కొత్తగాదు.
"పల్లెల రక్తమాంసాలు పీల్చి వెలసిన నగరం సకల ఐశ్వర్యాలు కొలువైన రాజభోగం ఈ నగరానికి ఇప్పుడు వెల కట్టవలసిందే గానీ అప్పుడే మా రక్త మాంసాలకు కూడా ఒక వెల కట్టి వుంటే బాగుండేది !"
కాలపు గమనాన్ని పట్టుకుని ఈచరిత్రనంతా ఒక సంభాషణ లో తెచ్చారు.ఈ కాలానికి కవలసిన కవితని అందించారు విజయ్
ఏదైనా జరిగినప్పుడు దీనికి నేనే కారణం అనిభావించడం.ఓ సందర్భాన్ని పరోక్షంగా అలా చిత్రించడం.ఓ వ్యక్తిత్వాన్ని అలా పరిశీలించడం కనిపిస్తుంది.నిజానికి మనోవైఙ్ఞానికవేత్తలు మనలోనిరెండురకాల దర్శనాలు దీనికి కారణమని అన్నారు.ఒక సందర్భాన్ని Possitive,Negitive మార్గాలనించి చూడ్డం వల్ల ఇలాంటివి జరుగుతాయని అన్నారు.సాధరణంగా ఇవి సత్యాన్ని వెదికేప్పుడో,ప్రస్తావిస్తున్న వ్యక్తి,ప్రాంతం మొదలైన వాటిమీద ప్రేమాభిమానాల్ని పెంచుకున్నప్పుడో కలుగుతాయి.
విమర్శలో నియతివాదం(Determinism)ఇది సంఘటనలనుండి కారణాలను అన్వేషిస్తుంది.ఒక్కోరకమైన భావజాలాలు కలిగిన వారు దీన్ని ఆమార్గంలో అర్థం చేసుకుంటారు.దృగ్గోచర అంశాధ్యయనం(Phenomenology)కూడ పూర్తిగా ఇలాంతిది కాకపోయినా దీనికి దగ్గరదే.పూర్వావగాహననుపక్కకు పెట్టి(కొత్తగానో,మళ్లె పూర్వంలానో0తటస్తంగా పాత్రని చిత్రించి దానిద్వారా చైతన్యాన్ని స్ఫురింపజేయడం.
జీవితంలో కలిగే సంబంధాలలో ఒక తప్పునుగురించిన వివరణ ఒకటి చాంద్ కవితలో కనిపిస్తుంది.ఇందులో స్త్రీ పాత్రని ఉన్నతీకరించారు.ప్రాచీన సాహిత్యంలో ఇలాంటివి కనిపిస్తాయి.విశాద సారంగ ధర నాటకంలో రాజుపాత్ర ఇలాప్రవర్తిస్తుంది.
ఆమేజీవితాన్ని సమర్పించడం,అతను పొరపాటు చేసాడు.తరువాతి పర్యవసానం,ఆమెను ఉన్నతీకరించడం ఇవి ఇందులోని అంశాలు.
"ఆమె ఒక తెల్లని కాగితాన్ని చేతికిచ్చి" ఇందులో కాగితం జీవితానికి ప్రతీక తరువాతి వాక్యాల్లో రాయడం జీవితాన్ని తీర్చిదిద్దడం అనే క్రమంలో వాడారు.రెండో వాక్యంలో ఆమె హెచ్చరిక కూడా ఉంటుంది. "" -కానీ ఒక్కటి గుర్తుంచుకో నువ్వేమి రాసినా చేరుపలేవు ఎందుకంటే నీ ప్రతీ రాత గుండె గదిలో పదిలమైపోతుంది నీ జ్ఞాపకంగా ... అని చేతిలో ఒదిగిపోయింది నిండు జీవితాన్ని అందిస్తూ" పొరపాటు జీవితాన్ని శాసించిన అంశాన్ని చిత్రించారిందులో..
"గుండె నిండిన కన్నీళ్ళు ఒలికిస్తూ రాసాను 'నన్ను క్షమించు ' అని" "కానీ... ఆమె ఒక కల్మషంలేని నవ్వు సజీవంగా నాకిచ్చివెళ్ళిపోయింది" ఈరెండువాక్యాలు ఇందులో జీవత్వాన్ని సంచలింపజేసే వాక్యాలు.నిర్మాణానికి సంబంధించి వాక్యాలపై ఇంక డ్ర్ష్టి పెట్తాల్సింది...మొదటినించి ఎక్కువ భాగం కథనాత్మకత(neretion)కనిపిస్తుంది.చివరి వాక్యాల్లో ఉండే సాంద్రతని ఇంకా ప్రదర్శించే అవకాశం ఉంది.చాలా చిన్న కవిత అయినా ఇందులోని సంధర్భం నించి గమనించ దగ్గ సందేశం ఉంది
చాలామందికూడా గమనించ వలసింది వాక్యాల్లోని పదాల మధ్యసంబంధాన్ని(Link).యూనిట్లుగా వ్యక్తం చేసినా దీన్ని సాధ్యం చేసుకోవాలి.చాంద్ గారికి జీవితాన్ని గమనించే స్పృహ తెలిసింది.ఎక్కువగా చదవడం వల్ల మరిన్ని నిర్మాణసంబంధంగా నేర్చుకోవచ్చు.చాంద్ గారినుండి మరింత మంచి కవిత్వాన్ని ఆశించడం ఇక మనవంతు.అభినందనలు చాంద్ గారు. _____ఎం.నారాయణ శర్మ